ఎల్ఏసీని అతిక్రమించి భారత భూభాగంలో చైనా గ్రామాలను నిర్మిస్తోందన్న వార్తలు పుకార్లేనని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్(CDS Bipin Rawat) తెలిపారు. చైనా వైఖరితో దేశ భద్రతకు భారీ ముప్పు తప్పదని పేర్కొన్న ఆయన.. వాస్తవాధీన రేఖ నుంచి సైనికులను వెనక్కి రప్పించేందుకు భారత్ ఇప్పట్లో చర్యలు తీసుకునే అవకాశాలు లేవని అభిప్రాయపడ్డారు. అణ్వాయుధాలు కలిగిన రెండు దేశాల మధ్య సరిహద్దు వివాద పరిష్కారానికి సన్నగిల్లుతున్న 'విశ్వాసం'.. పెరుగుతున్న 'అనుమానం' అడ్డుగా ఉన్నాయని తెలిపారు.
"భారత భూభాగంలో చైనా నూతన గ్రామాన్ని నిర్మిస్తోందనేది పూర్తి అవాస్తవం. అయితే చైనా వైపు ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి వాటిని నిర్మించుకుంది. సైనికులు నివసించేందుకు చైనా వీటిని నిర్మిస్తోందని భావిస్తున్నా. వారి కుటుంబాలను సైతం సులభంగా తీసుకొచ్చేందుకూ ప్రణాళికలు చేస్తూ ఉండొచ్చు.
---బిపిన్ రావత్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్
భారత సైనికులు సరిహద్దుల్లో విధుల నుంచి ఏడాదికి రెండు, మూడుసార్లు స్వస్థలానికి వెళ్లేందుకు సెలవులు లభిస్తాయని.. కానీ చైనా సైనికులకు ఈ అవకాశం లేదని బిపిన్ రావత్ అన్నారు.
"చైనా సైనికులు ఒంటరిగా ఉంటున్నారు. ప్రధాన భూభాగానికి వేల మైళ్ల దూరంలో నివసిస్తున్నారు. కానీ మన సైనికులు చాలా సంతోషకరమైన స్థితిలో ఉండటం చైనా సైనికులు గమనిస్తున్నారు. వారు కూడా ఇళ్లకు వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తారు."
---బిపిన్ రావత్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్
ఇక.. ఎల్ఏసీపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని.. అసలైన వాస్తవాధీన రేఖను భారత సైనికులు గుర్తించగలరని బిపిన్ రావత్ స్పష్టం చేశారు.
"వాస్తవాధీన రేఖలో మాకు(భారత సైన్యానికి) కొన్ని ప్రాంతాలు తెలుసు, మరికొన్ని తెలియవనే అభిప్రాయం చైనాకు ఉంది. అయితే అది పూర్తిగా తప్పు. ఎల్ఏసీ ఎక్కుడుందనే విషయంపై అవగాహన ఉందని వారు ఎప్పుడు చెబుతారు. కానీ దానిని కచ్చితంగా వివరంచరు."
---బిపిన్ రావత్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్
భారత్ వైపు చైనా గ్రామాభివృద్ధి చేపట్టి పటిష్ఠంగా తయారైందని మీరు భావిస్తున్నారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు "కచ్చితంగా కాదు, అసలు దీనిని పటిష్ఠం అని కూడా అనుకోవట్లేదు. సరిహద్దు ప్రాంతాలకు వేగంగా చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మనం కూడా అదే చేయాలి," అని బదులిచ్చారు.
ఎల్ఏసీ వెంబడి.. భారత భూభాగంలో చైనా గ్రామాన్ని నిర్మించుకుందని ఇటీవలే అమెరికా ఓ నివేదికలో పేర్కొంది. కాగా.. చైనా ఆక్రమణలను భారత్ ఎప్పుడు గుర్తించదని విదేశాంగశాఖ తెలిపింది. ఆ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవీ చదవండి: