హరియాణాలో దారుణం జరిగింది. ఓ బాలుడు ఆడుకుంటుండగా ఉరి పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన పానీపత్ జిల్లాలో జరిగింది. బంగాల్ ఇస్లాంపుర్ ప్రాంతానికి చెందిన కోషర్.. హరియాణాకు వలస వచ్చి పానీపత్ జిల్లా భాల్సీ గ్రామంలో నివాసం ఉంటున్నాడు. అక్కడే ఓ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. అతడికి భార్య నర్గీస్, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా కోషర్ పనికి వెళ్లగా.. అతడి భార్యాపిల్లలు ఇంట్లోనే ఉన్నారు. అతడి పెద్ద కుమారుడు నజీం రాజా(13).. తల్లి వారిస్తున్నా వినకుండా ఆడుకోవడానికి వెళ్లాడు. ఓ ఖాళీ గదిలో సీలింగ్‌కు వేళాడుతున్న బట్టముక్క ఉచ్చులో పడి ప్రాణాలు కోల్పోయాడు. రాజా ఎంత సేపటికీ ఇంటికి రాకపోవడం వల్ల.. అతడి కుటుంబ సభ్యులు వెతకడం మొదలు పెట్టారు.
ఈ క్రమంలోనే గాలిస్తుండగా.. ఉచ్చుకు వేళాడుతున్న తన సోదరుడిని చూసి తల్లికి చెప్పాడు నర్గీస్ చిన్న కుమారుడు. దీంతో ఆమె వచ్చి చూసేసరికి.. రాజా ఇంకా ఊపిరి పీలుస్తున్నాడు. కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం బాలుడు చనిపోయాడని వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
బొమ్మ ట్రైన్ కింద పడి మహిళ మృతి..
ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం జరిగింది. పిక్నిక్కు వచ్చిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు.. జూలో బొమ్మ ట్రైన్ కింద పడి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కాన్పుర్‌లో జరిగింది. ఉపాధ్యాయురాలు అంజు శర్మ.. శనివారం తన కుమార్తెతో కలిసి కాన్పూర్‌లోని జూకు వచ్చింది. అనంతరం తన కుమార్తెను అక్కడే ఉన్న ఓ బొమ్మ ట్రైన్‌ను ఎక్కించింది. తన కుమార్తె వద్ద కుర్చోడానికి ట్రైన్ ఎక్కడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలోనే ఆమె చీర ట్రైన్ చక్రాల్లో చిక్కుకుని కిందపడిపోయింది. ట్రైన్ ఆమె పైనుంచి వెళ్లింది. వెంటనే జూ అధికారుల, డాక్టర్లు ఘటనా స్థలానికి చేరుకుని.. మృతురాలిని సిటీలోని ఎల్ఎల్ఆర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అంజు శర్మ చనిపోయిందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న నవాబ్ గంజ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించారని తమ దృష్టికి వస్తే.. తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇంగ్లీష్ రావడం లేదని టీనేజర్ ఆత్మహత్య..
ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడటం రావడం లేదని మనస్తాపానికి గురైన ఓ టీనేజర్ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇందోర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌరినగర్ కాలనీకి చెందిన 17 ఏళ్ల శైల్ కుమారి, ఎయిర్ హోస్టెస్ కోచింగ్ తీసుకుంటోంది. ఇంగ్లీష్ మాట్లాడడం రాకపోడవడం వల్ల.. దానికీ కోచింగ్ తీసుకుంటోంది. అయినా ఇంగ్లీష్ రాకపోవడం వల్ల మనస్తాపానికి గురైన శైల్కుమారి అత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి : లోన్ ఎగ్గొట్టేందుకు భార్య హత్య.. మతిస్థిమితం లేని బాలికపై మైనర్ రేప్