హనుమాన్ చాలీసా కంఠస్థం చేయడానికి విశ్వప్రయత్నాలు చేస్తుంటారు కొందరు. కానీ, అది పూర్తి చేయలేక విఫలమవుతుంటారు. కర్ణాటకకు చెందిన 13 ఏళ్ల చిన్నారి మాత్రం ఇందుకు భిన్నం. లాక్డౌన్లో తనకు దొరికిన ఖాళీ సమయాన్ని హనుమాన్ చాలీసా కంఠస్థం చేసే అమృత గడియల్లా భావించింది. కృత నిశ్చయంతో మొత్తం నేర్చుకుని గుక్కతిప్పకుండా 'చాలీసా' చదివి రికార్డులకెక్కింది.
కొత్త విషయాలంటే మక్కువ...
కర్ణాటక చిక్కమగలూరులోని విజయపురకు చెందిన జి.తన్మయి వశిష్టకు చిన్నప్పటి నుంచే కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే ఆసక్తి ఎక్కువ. 8వ తరగతి చదువుతోన్న తన్మయి... కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్లో హనుమాన్ చాలీసా నేర్చుకోవాలని సంకల్పించింది. ఎట్టకేలకు మొత్తం నేర్చుకుని 1.10 నిమిషాలలోనే గుక్కతిప్పకుండా చెప్పి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది.
ఇతర కళల్లోనూ....
తనకున్న ఆసక్తితో బొమ్మలు గీయడం, పాటలు పాడడం, పద్యాలు నేర్చుకోవడం వంటి ఇతర కళల్లోనూ ప్రావీణ్యం సంపాదించింది తన్మయి.
"తన్మయి ఈ ఘనత సాధిస్తుందని అస్సలు ఊహించలేదు. చిక్కమగలూరు వాసులంతా తనను చూసి గర్వపడేలా చేసింది. లాక్డౌన్లో సమయం వృథా చేయకుండా చాలీసా నేర్చుకుంది".
-క్రిప గిరీష్, తన్మయి తల్లి.
తన్మయి గతంలోనూ పలు కార్యక్రమాల్లో పాల్గొని ఎన్నో అవార్డులు గెలుచుకుంది.
ఇదీ చదవండి:జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్ షురూ