దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యంపై(Delhi Air Pollution) సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దిల్లీలో ప్రస్తుతం 'అత్యవసర పరిస్థితి' నెలకొందని.. ఇంట్లోనూ మాస్కులు ధరించాల్సి వస్తోందని పేర్కొంది. దిల్లీలో వాయు కాలుష్యంపై(Delhi Air Pollution) దాఖలైన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా... భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం(Supreme Court On Delhi pollution) ఈ మేరకు వ్యాఖ్యానించింది.
"దిల్లీలో వాయు నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరింది. రెండు మూడు రోజుల్లో అది మరింత ప్రమాదకరంగా మారతుంది. కాలుష్యం కట్టడికి తక్షణమే ఓ నిర్ణయం తీసుకోండి. అనంతరం మనం శాశ్వత పరిష్కారం కోసం ఆలోచిద్దాం. వాయు నాణ్యత సూచీని(Air Quality Index Delhi) 500 నుంచి 200 పాయింట్లకు ఎలా తగ్గించగలం? రెండు రోజులపాటు లాక్డౌన్ విధించవచ్చేమో ఆలోచించండి. ఈ వాతావరణం మధ్యే పిల్లలు పాఠశాలలకు వెళ్తున్నారు. వారిని మనం వాయు కాలుష్య ప్రభావానికి గురయ్యేలా చేస్తున్నాం. గాలి కాలుష్యం కారణంగా కరోనా, డెంగీ బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎయిమ్స్ వైద్యులు డాక్టర్ గులేరియా ఇటీవలే తెలిపారు.
-సుప్రీంకోర్టు
కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ... పంజాబ్లో పంట వ్యర్థాలు దహనం చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. అయితే... రైతులే బాధ్యులైతే.. కాలుష్యం కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటని ధర్మాసనం ప్రశ్నించింది. అందుకు.. తాను రైతులు మాత్రమే బాధ్యులని చెప్పడం తన ఉద్దేశం కాదని కోర్టుకు మెహతా వివరించారు.
'మీరేం చేశారు?'
స్మాగ్ టవర్లు, ఉద్గార నియంత్రణ ప్రాజెక్టులపై దిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కేంద్రం మాత్రమే కాకుండా.. దిల్లీ ప్రభుత్వం కూడా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను నవంబరు 15కు వాయిదా వేసింది.
దిల్లీ సీఎం అత్యవసర సమావేశం..
దిల్లీలో వాయు కాలుష్య(Delhi pollution) కట్టడి కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం సాయంత్రం 5 గంటలకు అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్, పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్, దిల్లీ సీఎస్ సహా ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరవనున్నారు.
దిల్లీలో గాలినాణ్యత ప్రమాదకరంగానే కొనసాగుతోంది. వాయు నాణ్యత సూచిలో శనివారం ఉదయం 473 పాయింట్లుగా నమోదైంది. దిల్లీ సమీప ప్రాంతాలైన నోయిడాలో 587, గుడ్గావ్లో 557గా ఉంది.
ఇదీ చూడండి: Assembly polls 2022: యూపీ పీఠం భాజపాదే- పంజాబ్లో ఆప్ హవా!