సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన జస్టిస్ రాజేశ్ బిందాల్, జస్టిస్ అరవింద్ కుమార్‌లతో సోమవారం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ప్రమాణస్వీకారం చేయించారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది. అలహాబాద్, గుజరాత్ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేస్తున్న వీరిద్దరూ ఇటీవల పదోన్నతులు పొందారు. వీరిద్దరూ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య తొమ్మిది నెలల వ్యవధి తర్వాత పూర్తిస్థాయికి (34) చేరింది. గత సోమవారం, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలుగు బిడ్డ జస్టిస్ పులిగోరు వెంకట సంజయ్ కుమార్‌తో జస్టిస్ చంద్రచూడ్ ప్రమాణస్వీకారం చేయించారు. మరో నలుగురు న్యాయమూర్తులు జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అసనుద్దీన్ అమనుల్లా, మనోజ్ మిశ్రలు సైతం సుప్రీం జడ్జీలుగా ప్రమాణం చేశారు.
జస్టిస్ రాజేశ్ బిందాల్: పంజాబ్, హరియాణా హైకోర్టు కేడర్‌కు చెందిన జస్టిస్ రాజేశ్ బిందాల్ 2021 అక్టోబర్ 11 నుంచి అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తున్నారు. 1961 ఏప్రిల్ 16న జన్మించిన ఈయన కురుక్షేత్ర విశ్వవిద్యాలయం నుంచి న్యాయవిద్యలో పట్టభద్రులయ్యారు. 2006 మార్చి 22న పంజాబ్, హరియాణా హైకోర్టు జడ్జిగా బాధ్యతలు స్వీకరించి.. జమ్మూకశ్మీర్, కోల్‌కతా హైకోర్టుల న్యాయమూర్తిగానూ పనిచేశారు.
జస్టిస్ అరవింద్ కుమార్ : కర్ణాటక హైకోర్టు కేడర్‌కు చెందిన జస్టిస్ అరవింద్ కుమార్ 2021 అక్టోబర్ 13 నుంచి గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తున్నారు. 1962 జులై 14న జన్మించిన ఈయన 1987లో న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించారు. 2005లో అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా నియమితులయ్యారు. 2009లో కర్ణాటక హైకోర్టు అదనపు జడ్జిగా.. 2012లో శాశ్వత జడ్జిగా పదోన్నతి పొందారు.
హైకోర్టులకు సీజేలుగా నలుగురు..
దేశంలోని నాలుగు హైకోర్టులకు ఆదివారం ప్రధాన న్యాయమూర్తుల నియామకం కూడా జరిగింది. ఈ వివరాలను న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ ద్వారా ప్రకటించారు.
- గుజరాత్ హైకోర్టులో సీనియర్ జడ్జిగా పనిచేస్తున్న జస్టిస్ సోనియా గిరిధర్ గోకనీని అదే కోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమించారు. ఈ బాధ్యతలు స్వీకరించాక.. దేశంలోని 25 హైకోర్టుల్లో జస్టిస్ గోకని ఒక్కరే మహిళా ప్రధాన న్యాయమూర్తి అవుతారు. మరో మహిళా జడ్జి జస్టిస్ సబీనా హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇదే నెల 25వ తేదీ నాటికి 62 ఏళ్లు నిండటంతో జస్టిస్ గోకని పదవీ విరమణ పొందుతారు.
- ఒడిశా హైకోర్టు సీనియర్ జడ్జిగా ఉన్న జస్టిస్ జస్వంత్‌సింగ్ త్రిపుర హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమితులయ్యారు. ఈయన ఇదే నెల 22వ తేదీన పదవీ విరమణ పొందుతారు. తొలుత జస్టిస్ జస్వంత్‌సింగ్ పేరును ఒడిశా హైకోర్టు సీజేగా సిఫార్సు చేసిన కొలీజియం ఆ ప్రతిపాదనను రీకాల్ చేయడంతో త్రిపుర హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమించింది.
- రాజస్థాన్ హైకోర్టు జడ్జి జస్టిస్ సందీప్ మెహతాను గువాహటి హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమించారు.
- గువాహటి హైకోర్టు జడ్జి జస్టిస్ ఎన్.కోటీశ్వర్‌సింగ్ జమ్మూకశ్మీర్, లద్దాఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
ఇవీ చదవండి: