విస్పష్టమైన లక్ష్యం మనముందుంటే దేన్నైనా సాధించగలమని నిరూపించారు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అంగన్వాడీ సేవకురాలు అమితా శ్రీవాస్. జాంజగీర్-చంపా జిల్లాకు చెందిన ఈమె..ఆఫ్రికాలోని అత్యంత ఎత్తైన శిఖరం(5,895మీ.) కిలిమంజరోను మహిళా దినోత్సవం రోజున అధిగమించారు. సాహసోపేతమైన పర్వతారరోహణ యాత్రను పూర్తి చేసినందుకు గాను అమితను ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భఘేల్ అభినందించారు.
![Chhattisgarh woman conquers Mount Kilimanjaro](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10948500_476_10948500_1615370629148.png)
ఎవరెస్ట్.. నా కల..
అంత సులువు కాని ఈ యాత్రను అమిత ఐదు రోజుల్లోనే పూర్తిచేశారు. మార్చి 4, ఉదయం 7.45కి మొదలుపెట్టి మార్చి 8న ఉదయం 7.45కి శిఖరాగ్రానికి చేరారు. ఈ సాహసయాత్రకు ఛత్తీస్‌గఢ్‌లోని స్థానిక జిల్లా యంత్రాంగం పూర్తి సహకారాన్ని అందించింది. రాష్ట్ర పవర్ జనరేషన్ కంపెనీ అటల్ బిహారీ వాజ్‌పేయి థర్మల్ పవర్ ప్లాంట్‌తో కలిసి రూ.2,70,000లను యాత్ర కోసం అమితకు అందించింది. తనకు తోడ్పడినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, పర్వతారోహణ సహచరులకు అమిత కృతజ్ఞతలు తెలిపారు. మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించటం తన కల అని వెల్లడించారు.
గురువు ప్రేరణ.. అమ్మనాన్న సహకారం..
మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అమితా శ్రీవాస్.. పర్వతారోహకుడు, మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించిన రాహుల్ గుప్తా నుంచి ప్రేరణ పొందారు. రాహుల్ సమక్షంలో మూడేళ్లపాటు శిక్షణ పొందిన అమిత.. జాతీయ స్థాయిలో పలు అవార్డ్లు సైతం కైవసం చేసుకున్నారు. మౌంట్ అబులోని వివేకానందా పర్వతారోహణ శిక్షణా కేంద్రంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. తల్లిదండ్రుల సహకారంతోనే ఇంతవరకు వచ్చానని అమిత అంటున్నారు. వారు తనను నిరంతరం ప్రోత్సహించేవారని చెబుతున్నారు.
మహిళలకు అంకితం..
ఇప్పటి వరకు తాను సాధించిన విజయాలు ఛత్తీస్‌గఢ్ మహిళలందరికీ చెందుతాయని అమిత చెప్పారు. ఎలాంటి విజయాలనైనా మహిళలు సాధించగలరని, అందుకు తనే ఒక ఉదాహరణ అని అన్నారు. సమాజంలో సమాన ప్రోత్సాహం అందిస్తే మహిళలు సైతం అన్ని రంగాల్లో ముందుంటారని చెప్పారు.
ఇదీ చదవండి: చిరుతను పట్టి.. తాళ్లతో కట్టిన యువకులు