Chhattisgarh liquor scam : ఛత్తీస్‌గఢ్‌లో వెలుగులోకి వచ్చిన మద్యం కుంభకోణం విలువ రూ.2,161 కోట్లు అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తెలిపింది. ఇందులో రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్ల హస్తం ఉందని వెల్లడించింది. ఈ స్కామ్‌లో కాంగ్రెస్ నాయకుడు ఐజాక్ దేభర్ సోదరుడు అన్వర్, ఛత్తీస్‌గఢ్ స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్(CSMCL) ఎండీ అరుణ్‌పతి త్రిపాఠి, మద్యం వ్యాపారి త్రిలోక్ సింగ్ ధిల్లాన్, హోటల్ వ్యాపారులు పురోహిత్, అరవింద్ సింగ్‌లను నిందితులుగా పేర్కొంది ఈడీ. ఈ మేరకు మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఛత్తీస్‌గఢ్‌లోని ప్రత్యేక కోర్టుకు తెలిపింది. 13 వేల పేజీల డేటాను కోర్టు ముందుంచింది.
'రాష్ట్ర ఎక్సైజ్ శాఖలో 2019 నుంచి 2023 మధ్యకాలంలో భారీ అవినీతి జరిగింది. అందులో రాజకీయ నాయకులు, మద్యం వ్యాపారులు, సిండికేట్ల ప్రమేయం ఉంది. మద్యం కుంభకోణంలో రూ. 2,161 కోట్ల అవినీతి జరిగింది. ఈ మొత్తం సొమ్ము రాష్ట్ర ఖజానాకు వెళ్లాల్సింది' అని ఈడీ.. కోర్టుకు ప్రాసిక్యూషన్ కంప్లైంట్ ఇచ్చింది. మరోవైపు, మద్యం కుంభకోణం నిందితులు.. దేభర్, ధిల్లాన్‌ల తరఫు న్యాయవాది తన క్లయింట్లను ఈడీ అక్రమంగా ఈ కేసులో ఇరికించాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
మద్యం కుంభకోణం ఎలా జరిగిందంటే..
ఛత్తీస్‌గఢ్‌లో అన్ని మద్యం షాపులను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఛత్తీస్‌గఢ్ స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (CSMCL) షాపుల నిర్వహణ, నగదు వసూలు, బాటిల్ తయారీ, హాలోగ్రామ్ తయారీ కోసం టెండర్లు పిలుస్తుంది. ఈ క్రమంలో రాజకీయ నాయకులు, CSMCL కమిషనర్, ఎండీల సహకారంతో తన సన్నిహితులైన వికాస్ అగర్వాల్, అర్వింద్ సింగ్‌లతో కలిసి బాటిల్ తయారీ నుంచి మద్యం అమ్మకాల వరకు ప్రతి విభాగంలో పెద్ద ఎత్తున లంచాలు ఆశచూపి పూర్తి మద్యం సరఫరా వ్యవస్థను అన్వర్ తన అధీనంలోకి తెచ్చుకున్నట్లు అంతకుముందు ఈడీ వెల్లడించింది.
తర్వాత మద్యం సరఫరా చేసే కంపెనీల నుంచి కేస్‌పై (మద్యం బ్రాండ్ ఆధారంగా) రూ. 75 నుంచి రూ. 150 కమిషన్ వసూలు చేశాడని ఈడీ ఆరోపిస్తోంది. ప్రైవేటుగా నకిలీ మద్యం తయారుచేసి, వాటిని ప్రభుత్వ దుకాణాల్లో విక్రయించి 30 నుంచి 40 శాతం కమిషన్ పొందాడని ఈడీ చెబుతోంది. 2022లో ఐఏఎస్ అధికారి అనిల్ తుటేజాపై ఐటీశాఖ దాడులతో ఈ కుంభకోణం వెలుగు చూసింది.