Fish Prasadam Distribution at Nampally Exhibition Grounds : కొవిడ్ నేపథ్యంలో మూడేళ్ల విరామం తర్వాత ఇవాళ తిరిగి చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా పంపిణీ ప్రారంభమైంది. ఇందుకోసం ఇప్పటికే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2019లో ఆఖరి సారి చేప ప్రసాదం పంపిణీ చేయగా.. కొవిడ్ నేఫథ్యంలో గత మూడేళ్లుగా పంపిణీ నిలిచిపోయింది.
Chepa Mandu Distribution in Hyderabad Today : ఏటా మృగశిర కార్తె ప్రారంభం రోజున ఉబ్బసం, ఆయాసం వంటి శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారికి బత్తిని సోదరులు ఉచితంగా ఈ చేప ప్రసాదం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. దశాబ్దాలుగా సాగుతున్న ఈ కార్యక్రమం గురించి తెలుసుకుని ఏపీ, తెలంగాణ సహా మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, హర్యానా, దిల్లీ వంటి అనేక ప్రాంతాల నుంచి రెండు రోజుల ముందుగానే వ్యాధిగ్రస్తులు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కి చేరుకున్నారు. చేప ప్రసాదం తీసుకుంటే శ్వాసకోశ ఇబ్బందులు ముఖ్యంగా ఆస్తమా వంటి సమస్యలు తగ్గిపోతాయని ప్రజలు విశ్వసిస్తుంటారు.
Fish Medicine Distribution in Hyderabad : దాదాపు మూడేళ్ల విరామం తర్వాత చేప ప్రసాదం పంపిణీ మరోమారు చేపడుతున్న నేపథ్యంలో ఎంతమంది బాధితులు వస్తారన్న విషయంలో సరైన స్పష్టత లేకపోవటం గమనార్హం. ఈ నేపథ్యంలో తెలంగాణ మత్స్యశాఖ ఆధ్వర్యంలో 1.5 లక్షల కొర్రమీను చేపలను అందుబాటులో ఉంచారు. అదనంగా మరో 75 వేల చేప పిల్లలతో పాటు.. అవసరమైతే మరిన్ని చేప పిల్లలను అందించేందుకు సన్నద్ధంగా ఉన్నట్టు ఇప్పటికే ప్రకటించారు.
Fish Prasadam at Nampally Exhibition Grounds : ఇక బత్తిని సోదరులు సైతం దాదాపు 5 లక్షల మందికి సరిపోయేలా 5 క్వింటాళ్ల చేప ప్రసాదం తయారు చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మొత్తం 32 క్యూలైన్ల ద్వారా ప్రసాదం పంపిణీ చేయనున్నారు. బత్తిని కుటుంబానికి చెందిన సుమారు 250 మంది ఈ చేప మందు పంపిణీలో పాల్గొననున్నారు. ఇక ప్రజలు భారీగా రానున్న నేపథ్యంలో నాంపల్లి గ్రౌండ్ పరిసరాల్లో మొత్తం 700 వరకు సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేసిన సర్కారు.. రెండు రోజుల పాటు దాదాపు 300 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లను చేసింది. రెండు రోజుల పాటు జరగనున్న చేప ప్రసాదం పంపిణీలో వేలాది మంది పాల్గొని ప్రసాదం స్వీకరించనున్నారు. ఇప్పటికే ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కి చేరుకున్న వారి కోసం స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా భోజన సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి.
ఇవీ చదవండి: