ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) సంచలనం చాట్‌జీపీటీ రోజురోజుకి మరింత విస్తరిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా నిర్వహించే సివిల్స్ పరీక్షలతో పాటు లా, ఎంబీఏ పరీక్షలను రాసి కొన్నిట్లో మెరుగైన ఫలితాలు సాధించి ఔరా అనిపించింది. ఇక తాజాగా పంజాబ్-హరియాణా హైకోర్టుకు సైతం న్యాయ సలహా అందించింది. ఓ క్రైమ్ కేసుకు సంబంధించి నిందితుడికి బెయిల్ మంజూరు విషయంలో చాట్‌జీపీటీ సూచనలను అడిగి తెలుసుకున్నారు జడ్డీలు. బహుశా భారతీయ న్యాయవ్యవస్థలోనే ఈ సంఘటన మొదటిది కావచ్చు. ఇంతకీ చాట్‌జీపీటీని న్యాయమూర్తులు అడిగిన ప్రశ్న ఏంటి.. దీనికి ఏఐ ఇచ్చిన సమాధానమేంటో ఇప్పుడు చూద్దాం.
దుండగులు క్రూరత్వంతో ఇతరులపై దాడి చేసినప్పుడు.. అతడి బెయిల్ అభ్యర్థనపై న్యాయపరంగా మీరిచ్చే సలహా ఏమిటి? అని అడిగారు జడ్దిలు. దీనికి చాట్‌జీపీటీ స్పందిస్తూ.. క్రూరత్వం ద్వారానే మనిషి చంపుతున్నారు కాబట్టి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తాను అని చాట్‌జీపీటీ బదులిచ్చింది. ఓ దుండగుడు క్రూరత్వంతో ఓ వ్యక్తిపై శారీరక దాడి చేస్తే గనుక దాని తీవ్రతను బట్టి బెయిల్ మంజూరు చేసే విధివిధానాలు కూడా మారుతాయని చాట్‌జీపీటీ వివరించింది. నేరంలో ఉండే క్రూరత్వ తీవ్రతను బట్టి బెయిల్ మంజూరు చేయాలా వద్దా అన్నది ఆధారపడి ఉంటుందని ఏఐ చెప్పింది. క్రూరత్వంతో వ్యవహరించే వ్యక్తుల ప్రభావం బాధితులపైనే కాకుండా సమాజానికి ప్రమాదకరమేనని చాట్‌జీపీటీ అభిప్రాయపడింది. దుండగుడి దాడి తీవ్రత, నిందితుడి నేర చరిత్ర, వీరికి వ్యతిరేకంగా దాఖలయ్యే సాక్ష్యాల బలం వంటి అంశాలు అతడికి బెయిల్ మంజూరు చేయాలా వద్దా అన్నది నిర్ణయిస్తాయని చాట్‌జీపీటీ బదులిచ్చింది. మొత్తంగా నిందితుడు చేసే క్రూరమైన చర్య ఆధారంగా చట్టంలోని నిబంధనల ప్రకారం శిక్ష విధించడమో లేదా ఊరట కలిగించడమో చేయవచ్చని చాట్‌జీపీటీ సమాధానం ఇచ్చింది. అలాగే తాను నిర్దోషినని నిరూపించుకోవడానికి ప్రతివాది వద్ద బలమైన సాక్ష్యాలు ఉంటే తప్ప అతడు బెయిల్‌కు పిటిషన్‌కు అర్హుడు కాడని చెప్పింది. అయితే నిందితుడి నేర ప్రవృత్తి, సత్ప్రవర్తనని న్యాయమూర్తులు పరిగణలోకి తీసుకొని బెయిల్ మంజూరు చేయవచ్చని చాట్‌జీపీటీ సూచించింది.
అయితే న్యాయశాస్త్రంపై చాట్‌జీపీటీకి ఏ మేరకు అవగాహన ఉందో అని తెలుసుకోవడానికి మాత్రమే ఈ ప్రయోగం చేశామని న్యాయమూర్తులు వెల్లడించారు. కాగా, చాట్‌జీపీటీ ఇచ్చే సమాచారం, సూచనలు లేదా వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని తీర్పులను వెలువరించరాదని జస్టిస్ అనూప్ చిట్కారా తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
ఇక కేసు విషయానికి వస్తే పంజాబ్‌కు చెందిన నిందితుడిపై 2020 జూన్‌లో లూథియానా జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్‌లో హత్యతో పాటు ఇతర నేరాలకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఇదే కేసులో తమ క్లైంట్ బెయిల్‌కు అర్హుడని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. నిందితుడి గతాన్ని బట్టి అతడు బెయిల్‌పై విడుదలయ్యాక భవిష్యత్‌లో మరిన్ని నేరాలకు పాల్పడే అవకాశం ఉందని న్యాయమూర్తులు బెయిల్ అభ్యర్థనను తిరస్కరించారు.