Chaos in Uttarakhand BJP: ఉత్తరాఖండ్‌లో ఎన్నికల అనంతరం భాజపాలో గందరగోళం నెలకొంది. పార్టీ అంతర్గత కలహాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. సొంత అనుచరులే ఎన్నికల్లో తాము ఓడిపోయేలా కుట్ర పన్నారని పోలింగ్ అనంతరం ముగ్గురు ఎమ్మెల్యేలు ఆరోపించారు. రెండోసారి రాష్ట్రంలో అధికారం చేపడతామని భాజపా ధీమా వ్యక్తం చేసినప్పటికీ తాజా పరిణామాలు చర్చనీయాంశమయ్యాయి.
ఫిబ్రవరి 14 ఉత్తరాఖండ్‌లో ఎన్నికలు జరిగాయి. 70 స్థానాల్లో ఒకేసారి పోలింగ్ జరిగింది. మార్చి 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ నేపథ్యంలో లక్సార్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన భాజపా అభ్యర్థి ప్రదీప్ గుప్తా తీవ్ర ఆరోపణలు చేశారు. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మదన్ కౌశిక్ వర్గం తనకు వ్యతిరేకంగా బీఎస్పీ కోసం ప్రచారం చేసిందని ఆరోపించారు. కౌశిక్‌ను దేశద్రోహిగా అభివర్ణించిన గుప్తా.. ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
కాశీపుర్ ఎమ్మెల్యే హర్భజన్ సింగ్ చీమా తనయుడు త్రిలోక్ సింగ్ ఈసారి కాశీపుర్ నుంచి పోటీ చేశారు. అయితే.. కార్యకర్తలు తన కుమారునికి వ్యతిరేకంగా ప్రచారం చేశారని పోలింగ్ అనంతరం ఆరోపించారు హర్భజన్. ఇదే విధంగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు.. దేహ్రాదూన్ కంటోన్మెంట్ అభ్యర్థి సవితా కపూర్, చంపావాట్ ఎమ్మెల్యే కైలాశ్ చంద్ర కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు.
ఈసారి 60 స్థానాలు సాధించి అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేసింది భాజపా.
ఇవీ చూడండి: 'కాంగ్రెస్ గెలిస్తే మహిళలకు నెలకు రూ.1100, లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు!'