Channi defamation on Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్‌పై పరువు నష్టం కేసు వేస్తానని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ప్రకటించారు. తనను అవినీతిపరుడిగా కేజ్రీవాల్ పేర్కొనడం సహా తన మేనల్లుడి ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించినట్లు చెప్పడంపై మండిపడ్డారు. ఇతరులను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం కేజ్రీవాల్‌కు అలవాటేనని ఆరోపించారు. ఇలాంటి వ్యాఖ్యల కారణంగానే గతంలో ఆయన భాజపా నేతలు నితిన్ గడ్కరీ, అరుణ్ జైట్లీతో పాటు ఎస్‌ఏడీ నేత బిక్రమ్‌సింగ్ మజీథియాకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందన్నారు.
"కేజ్రీవాల్‌పై పరువునష్టం కేసు వేస్తాను. ఇందుకు అనుమతి ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరాను. నన్ను అవినీతిపరుడిగా కేజ్రీవాల్ ప్రచారం చేస్తున్నారు. ఆయన ట్విట్టర్ పేజ్‌లో కూడా అలానే పోస్ట్ చేశారు."
- చరణ్‌జిత్ సింగ్ చన్నీ, పంజాబ్ ముఖ్యమంత్రి
అక్రమ ఇసుక మైనింగ్ వ్యవహారంలో చన్నీ సమీప బంధువుల ఇళ్లపై ఈడీ దాడులు నిర్వహించింది. నాటి నుంచి ఆయనపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తోంది ఆప్.
మరోవైపు వచ్చే ఎన్నికల్లో చమ్‌కౌర్ సాహిబ్ స్థానం నుంచి చన్నీ ఓడిపోతారని జోస్యం చెప్పారు కేజ్రీవాల్. ఆయన మేనల్లుడి ఇంటిలో కోట్లాది రూపాయలను ఈడీ స్వాధీనం చేసుకోవడం చూసి ప్రజలు షాక్ అయ్యారని ఎద్దేవా చేశారు.
దీనిపై మాట్లాడిన సీఎం చన్నీ.. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. వారు షేర్ చేసిన ఫోటోల్లో చూపించిన విధంగా తన దగ్గర నోట్ల కట్టలు బయటపడలేదని తెలిపారు. డబ్బు ఎవరి దగ్గరో దొరికితే.. తనను నిందించడం సరికాదన్నారు. తానే అవినీతి చేసి ఉంటే ఈడీ సరాసరి తన ఇంట్లోనే సోదాలు చేసి, ప్రశ్నించి, అరెస్ట్ చేసేదని చెప్పారు.
ఇదీ చూడండి: 'నేను కాక ఇంకెవరు?'.. యూపీ సీఎం అభ్యర్థిపై ప్రియాంక హింట్!
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!