TDP chief Chandrababu Naidu harsh comments on CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రులపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో జగన్ మోహన్ రెడ్డి క్షమించరాని నేరం చేశాడని చంద్రబాబు ఆరోపించారు. ఇప్పటికైనా చేసిన తప్పును ఒప్పుకుని చెంపలేసుకుంటే.. ఆ భగవంతుడైనా క్షమిస్తాడని హితవు పలికారు. అంతేకాకుండా, పోలవరంపై సిగ్గులేకుండా మరోసారి రంకెలేస్తే ఇక వాతలు పెట్టడం తప్ప మరో మార్గం లేదని హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్ట్ పట్ల వైఎస్సార్సీపీ పాలకులు పేకాటలో జోకర్ మాదిరి వ్యవహరించారన్న చంద్రబాబు.. పోలవరం ప్రాజెక్టుపై జగన్ రెడ్డి, మంత్రులు వ్యవహరించిన వీడియోలను చంద్రబాబు ప్రదర్శించారు.
సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై చంద్రబాబు యుద్ధభేరి.. ఆగస్టు 1వ తేదీ నుంచి నారా చంద్రబాబు నాయుడు 'సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి' పేరుతో పర్యటన ప్రారంభించారు. పర్యటనలో భాగంగా ఆయన మొదటగా రాయలసీమలో పర్యటించి.. పలు ప్రాజెక్టుల పనులను పరిశీలించారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రాజెక్టులకు జరుగుతున్న అన్యాయాన్ని, జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, పెట్టిన ఖర్చుల వివరాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన చంద్రబాబు.. చింతలపూడి ఎత్తిపోతల పథకం, పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల స్థితిగతులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
జగన్ మూర్ఖత్వంతో డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది.. ''జగన్ మోహన్ రెడ్డి జాతి ద్రోహం చేసి, తీవ్ర అన్యాయం చేశారు. చేతకాని తనం వల్ల రాష్ట్రం మునిగిపోవటం మన దౌర్భాగ్యం. లైఫ్ లైన్ ప్రాజెక్టును విషాదం చేశారు. పుంగనూరులో ప్రజా తిరుగుబాటు చూసే పోలవరం వరకు అనుమతించారు. ప్రజా తిరుగుబాటుకు ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. జగన్ మూర్ఖత్వంతోనే పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ఐఐటీ హైదరాబాద్ నివేదిక ప్రకారం.. పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతినటానికి 14 కారణాలలో ఒక్క కొవిడ్ మినహా మిగిలిన 13 కారణాలు వైసీపీ వైఫల్యాలే. గతంలోనూ పోలవరాన్ని ఆపడానికి జగన్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. 3 గ్రామాలు అప్పగించే సమయంలో అడ్డుకునే కుట్రలు పన్ని కేసులు పెట్టించారు. కేంద్రం ఆమోదించకుండా దిల్లీలో లాబీయింగ్ చేశాడు. అబద్ధాలతో పోలవరం మీద పుస్తకాలు ప్రచురించారు. ఈ నాలుగేళ్లలో ఒక్క ఆరోపణ కూడా నిరూపించలేకపోయారు. తెలుగుదేశం హయాంలో పోలవరం నిర్మాణంలో అవినీతి లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది.'' అని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
పోలవరం నిర్వాసితులకు ఇస్తానన్న 19 లక్షలేవీ..?.. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో హైదరాబాద్ IIT ఐఐటీ విడుదల చేసిన నివేదికలోని అంశాలను చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. ఐఐటీ నివేదికలోని పేజీ నెంబర్ 38 ప్రకారం.. పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ ప్రభుత్వం ఘోరమైన పాపాలు చేసిందని ఐఐటీ నివేదిక స్పష్టంగా చెప్పిందని చంద్రబాబు అన్నారు. 2020లో వచ్చిన రూ.22 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహానికి డయాఫ్రం వాల్ దెబ్బతిందని తెలిపారు. కాఫర్ డ్యామ్ గ్యాప్‌లను సకాలంలో పూర్తిచేయకపోవడం వల్లనే వరద నీరు ఈసీఆర్ఎఫ్ (ECRF) డ్యామ్ వద్దకు వెళ్లి, డయాఫ్రం వాల్ దెబ్బతిందని వివరించారు. జగన్..ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజునే పోలవరం పనులను నిలిపివేసి.. కాంట్రాక్టరుని వెళ్లగొట్టే పనిలో పడి ప్రాజెక్టు పనులు గాలికొదిలేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. పట్టిసీమతో సమానంగా ఎకరానికి పోలవరం నిర్వాసితులకు 19 లక్షలు ఇస్తానన్న జగన్.. నాలుగేళ్లలో ఒక్కరికీ పరిహారం ఇవ్వలేదని విమర్శించారు. లబ్ధిదారుల జాబితా మార్చి జగన్.. అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. సకల వసతులతో పునరావాస కాలనీలు, కొత్తగా ఒక్క ఇల్లు కట్టలేదని దుయ్యబట్టారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్వాకం వల్ల పోలవరం పదేళ్లు ఆలస్యం.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్వాకం వల్ల పోలవరం ప్రాజెక్ట్ పదేళ్లు ఆలస్యమైందని.. చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. రాష్ట్రానికి వరమైన పోలవరం 2004 నుంచీ పాలకుల నిర్వాకం వల్ల ప్రాజెక్టు రెండు సార్లు బలైందని ధ్వజమెత్తారు. 2004లో పోలవరానికి టెండర్లు మధుకాన్, శీనయ్య సంస్థలకు పనులు దక్కితే.. కక్ష సాధింపు చర్యలతో పనులు రద్దు చేశారని ఆరోపించారు. హెడ్ వర్క్స్‌ని నిర్ల్యక్యం చేసి, కమీషన్ల కోసం కాలువ పనులపై దృష్టి పెట్టారన్నారు. 2004 నుండి 2014 వరకు కేవలం 5శాతం పనులు మాత్రమే జరిగాయని చంద్రబాబు నాయుడు విమర్శించారు. రైతులకు పరిహారం ఇవ్వలేదని, పొరుగు రాష్ట్రాలతో వివాదాలు పరిష్కారం కాలేదని..చంద్రబాబు దుయ్యబట్టారు. బ్రిటీష్ వాడైనా కాటన్ దొర.. ప్రజల కోసం పని చేసిన మానవతావాదన్న చంద్రబాబు.. భవిష్యత్తు తరాలకు కరవు ఉండకూడదనే దూరదృష్టితో ఆనాడు కాటన్ దొర ప్రాజెక్టులు కట్టించాడని చంద్రబాబు గుర్తు చేశారు.