Chandrababu Arrest in Nandyala : తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఆంధ్రప్రదేశ్ CID అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థకు సంబంధించిన కేసులో అదుపులోకి తీసుకుంటున్నట్లు ఆయనకు నోటీసులు (CID Notices to Chandrababu Naidu) ఇచ్చారు. కేసుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలు సమర్పించాలని పోలీసులను చంద్రబాబు కోరారు. అందుకు సంబంధించినవివరాలు, రిమాండ్ రిపోర్టు తర్వాత ఇస్తామని CID అధికారులు చెప్పారు. ఆ వివరాలు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని చంద్రబాబు., ఆయన తరఫు న్యాయవాదులు పోలీసులను నిలదీశారు. చంద్రబాబు ఏం తప్పుచేశారో నోటీసుల్లో లేదంటున్న న్యాయవాదులు...పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలని సూచించారు.
High Tension in Nandyala : రాత్రంతా హైడ్రామా : నంద్యాలలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు బస చేసిన బస్సు వద్దకు పోలీసు బలగాలు పెద్ద సంఖ్యలో వెళ్లడం ఉద్రిక్తతకు దారి తీసింది. రాత్రి నంద్యాల బహిరంగసభలో పాల్గొన్న చంద్రబాబు...RK ఫంక్షన్ హాల్ వద్ద బస చేశారు. తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతంలో.. అనంతపురం DIG రఘురామిరెడ్డి నేతృత్వంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. చంద్రబాబును కలవాలంటూ NSG సిబ్బందిని రఘురామిరెడ్డి కోరారు. ఈ సమయంలో కలవాల్సిన పనేంటని పక్కనే ఉన్న తెలుగుదేశం నాయకులు ప్రశ్నించారు. మీకెందుకు చెప్పాలంటూ రఘురామిరెడ్డి ఎదురు ప్రశ్నించారు. కేసుతో మీకేం సంబంధం అంటూ వాదించారు. అసలు కేసేంటో చెప్పాలంటూ తెలుగుదేశం నేతలు రఘురామిరెడ్డిని నిలదీశారు.
కేసు వివరాలపై నోరు మెదపని DIG రఘురామిరెడ్డి చంద్రబాబు బస చేసిన బస్సు తలుపుల వద్దకు దూసుకెళ్లారు. వారి తీరుపై తెలుగుదేశం నాయకులు మండిపడ్డారు. విషయమేంటో చెప్పకుండా ఎందుకు హడావుడి చేస్తున్నారని నిలదీశారు. మీడియా ప్రతినిధులు ప్రశ్నించినా రఘురామిరెడ్డి ఎదురుదాడి చేయడం తప్ప సమాధానం ఇవ్వలేదు.
ఈ క్రమంలో డీఐజీ రఘురామిరెడ్డి, తెలుగుదేశం నాయకుల మధ్య సుదీర్ఘంగా వాగ్వాదం సాగింది. తెల్లవారుజామున చంద్రబాబు కాన్వాయ్ కదులుతుందనే సమాచారం వచ్చిందని, అందుకే వచ్చామని రఘురామిరెడ్డి చెప్పారు. అసలు అలాంటిదేమీ లేదని తెలుగుదేశం నేతలు స్పష్టం చేసినా DIG వెనక్కి తగ్గలేదు.
మరోవైపు... ప్రోటోకాల్ ప్రకారం ఉదయం ఐదున్నరవరకూ VIPని కలిసేందుకు అనుమతి ఇవ్వబోమని NSG సిబ్బంది తేల్చిచెప్పారు. ఉదయం ఐదున్నర తర్వాత.. వైద్య పరీక్షలు నిర్వహించి.. ఆ నివేదికను అధికారులకు పంపి అక్కడి నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం చంద్రబాబు వద్దకు పంపుతామని NSG కామాండెంట్ స్పష్టం చేశారు. చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేయించేందుకు వైద్యుల బృందాన్ని పోలీసులు బస్సు వద్దకు తెచ్చారు.
Chandrababu Arrest Tension in AP: రాష్ట్రం వ్యాప్తంగా హై అలర్ట్.. టీడీపీ నేతల హౌస్ అరెస్టులు..
అర్ధరాత్రి నుంచే చంద్రబాబు బస చేసిన ప్రాంతానికి పోలీసులు వ్యూహాత్మకంగా చేరుకున్నారు. రాత్రే అనంతపురం నుంచి బలగాలను. నంద్యాలకు రప్పించారు. చంద్రబాబు బస చేసిన బస్సు చుట్టూ రోప్ పార్టీ ఏర్పాటు చేశారు. తమ చర్యలకు అడ్డంకులు లేకుండా చేసుకున్న పోలీసులు అడ్డుపెట్టిన తెలుగుదేశం వాహనాలను జేసీబీతో తొలగించారు. తెలుగుదేశం కార్యకర్తలు, మీడియా బృందాలను బయటకు పంపారు. చంద్రబాబు బస్సు వద్ద ఉన్న నాయకులను అదుపులోకి తీసుకొని పోలీసు వాహనాల్లో తరలించారు.కాలవ శ్రీనివాసులు, భూమా బ్రహ్మానందరెడ్డి,ఎ.వి.సుబ్బారెడ్డి, బి.సి.జనార్దన్‌రెడ్డి, అఖిలప్రియ, ఇతర నేతలను అరెస్టు చేశారు.
Ganta Srinivasa Rao Arrested: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అరెస్టు