దేశంలో జులై 31 నాటికి 51.6 కోట్ల ప్రజలకు మొత్తం కొవిడ్ వ్యాక్సిన్(Covid vaccine) డోసులు అందుతాయని కేంద్రం తెలిపింది. 18 ఏళ్లు పైబడిన జనాభా 93-94 కోట్ల మేర ఉందనీ, వీరందరికీ పూర్తిస్థాయి వ్యాక్సిన్ అందించాలంటే 186-188 కోట్ల డోసులు అవసరమని పేర్కొంది. అంటే మరో 135 కోట్ల డోసులు కావాల్సి వస్తుందని, ఆగస్టు నుంచి డిసెంబరు మధ్యలో అవి అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను అనుసరించి శనివారం ఈ మేరకు ప్రమాణ పత్రం సమర్పించింది. జులై 31 వరకు సరఫరా చేసే కొవిషీల్డ్(Covishield), కొవాగ్జిన్(Covaxin) కోసం రూ.5,802 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది. ఇందులో ఇప్పటివరకు 35.6 కోట్ల డోసులు అందుబాటులోకి వచ్చాయని, ఇంకా 16 కోట్లు జులై 31లోపు వస్తాయని పేర్కొంది. ఈ వ్యాక్సిన్లకు తోడు బయోలాజికల్-ఈ, జైడస్ క్యాడిలా వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్ చివరి దశలో ఉన్నాయని, అవి అందుబాటులోకి వస్తే టీకాల లభ్యత మరింత పెరుగుతుందని తెలిపింది.
కొన్ని నెలల్లో ఫలితాలు..
టీకాల ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధ్యమైనంతమేర పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, వచ్చే కొన్ని నెలల్లో ఫలితాలు కనిపిస్తాయని కేంద్రం పేర్కొంది. దేశంలో వ్యాక్సిన్ల లభ్యతను పెంచేందుకు విదేశీ టీకా అనుమతులను సరళీకృతం చేసినట్లు తెలిపింది. దేశీయ వ్యాక్సిన్లను వివిధ ఉత్పత్తి కేంద్రాల్లో తయారు చేసేందుకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు వెల్లడించింది. కొవాగ్జిన్ అభివృద్ధి చేసేందుకు తొలినాళ్లలో సాయం చేసినందుకు ప్రభుత్వానికి రూ.150కి ఒక డోసు చొప్పున సరఫరా చేసేందుకు ఆ సంస్థ అంగీకరించిందని, అంతకుమించి తగ్గించడం సాధ్యపడదని స్పష్టంచేసింది. ప్రపంచంలో ఇది అతి తక్కువ ధర అని పేర్కొంది. విదేశాలకు చెందిన ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్, మోడెర్నా వ్యాక్సిన్ల సేకరణ కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సఫలమైతే దేశంలో వ్యాక్సినేషన్ వేగం మరింత పుంజుకుంటుందని తెలిపింది. చరిత్రలో ఎన్నడూలేని రీతిలో ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోందని వివరించింది.
క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతి
2 నుంచి 18 ఏళ్లలోపు వయసున్న వారిపై కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ జరిపేందుకు మే 12న డీసీజీఐ భారత్ బయోటెక్‌కు అనుమతి ఇచ్చిందని, వాలంటీర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతోందని కేంద్రం తెలిపింది. 12-18 ఏళ్ల వయసువారిపై క్లినికల్ ట్రయల్స్‌ను జైడస్ క్యాడిలా పూర్తిచేసిందని, దానికి తుది అనుమతులు రావాల్సి ఉందని వెల్లడించింది. ప్రైవేటులో వ్యాక్సిన్లకు ధరలు ఇష్టానుసారంగా నిర్ణయించడానికి వీల్లేదని, ఒకవేళ ఈ ధరల్లో ఏమైనా మార్పులు చేయాలంటే ముందుగా చెప్పాల్సి ఉంటుందని తెలిపింది. కొవిన్ పోర్టల్‌లో నమోదు తప్పనిసరి కాదు కాబట్టి సాంకేతిక పరిజ్ఞానం లేనివారిని విస్మరిస్తున్నట్లు కాదని స్పష్టంచేసింది. నేరుగా వ్యాక్సిన్ కేంద్రాలకు ప్రజలు వెళ్లవచ్చని చెప్పింది.
పరిహారం కోరడం సరికాదు
కరోనాతో మృతి చెందినవారికి రూ.4 లక్షలు చొప్పున పరిహారం చెల్లించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కేంద్రం వ్యతిరేకించింది. ఆర్థికంగా ఇది భారమా కాదా అనేది ఒక అంశమే కాదంది. హేతుబద్ధత, న్యాయ సమ్మతి, జాతి వనరుల్ని గరిష్ఠ స్థాయిలో వినియోగించుకోవడం వంటివి దృష్టిలో పెట్టుకుని చూస్తే అంత మొత్తాలను చెల్లించలేమని స్పష్టం చేసింది. "ఆర్థిక సాయం అందించాల్సిన 12 రకాల జాతీయస్థాయి విపత్తుల్లో కొవిడ్-19 లేదు. ఇప్పటివరకు ఏ రాష్ట్రం కూడా కొవిడ్-19 బాధితులకు పరిహారం చెల్లించలేదు. ఇలాంటి మహమ్మారులకు 'ప్రకృతి వైపరీత్యాల ఉపశమన' నిధులను వాడవద్దని 15వ ఆర్ధిక సంఘం కూడా చెప్పింది" అని వివరించింది.
ఇదీ చదవండి : పసి పిల్లలకు కొవిడ్-19 టీకా అవసరం లేదా?