నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులతో చర్చలు జరపాలనుకుంటే దానికి ప్రభుత్వం ఎలాంటి షరతులు విధించకూడదని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేష్ టికాయిత్ చెప్పారు. కొత్తగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాల రద్దు గురించి తప్పించి, మిగతా అంశాలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధమేనని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చేసిన ప్రకటన నేపథ్యంలో టికాయిత్ ఆదివారం స్పందించారు.
"ప్రభుత్వం ఎప్పుడు సిద్ధపడితే అప్పుడు చర్చలకు మేం సుముఖమేనని గతంలోనే చెప్పాం. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేది లేదనే షరతుల్ని ప్రభుత్వం ఎందుకు విధిస్తోంది. కార్పొరేట్ల ఒత్తిడికి లోబడి కేంద్రం పని చేస్తోంది. లేనట్లయితే మాతో ఇప్పటికే మాట్లాడి ఉండేది"
-రాకేశ్ టికాయిత్, బీకేయూ నేత
మరోవైపు.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడే రైతు సంఘాలు ఆందోళన చేయాలని నిర్ణయించాయి. పార్లమెంట్ భవనం ముందు దాదాపు 200 మంది రైతులతో.. సమావేశాలు ముగిసేవరకు ప్రతిరోజు నిరసన తెలపనున్నట్లు వెల్లడించింది. ప్రతిపక్ష ఎంపీలు రైతులకు మద్దతు తెలపాలని కోరుతామని తెలిపాయి.
కేంద్రం తీసుకువచ్చిన నూతన చట్టాలకు వ్యతిరేకంగా 2020 నవంబర్ నుంచి రైతులు దిల్లీ సరిహద్దుల్లో పోరాడుతున్నారు. దాదాపు 40 సంఘాలు ఒకే గొడుగు కిందికి చేరి ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. పదుల సంఖ్యలో రైతులు ప్రాణాలు కోల్పోయారు. కేంద్రానికి, రైతు సంఘాలకు మధ్య పలు మార్లు చర్చలు జరిగినా ఎటూ తేలకుండానే ముగిశాయి. తాజాగా పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో రైతు సంఘాలు నిరసనకు పూనుకున్నాయి.
ఇదీ చూడండి: సహనాన్ని పరీక్షించొద్దు.. రైతులకు సీఎం వార్నింగ్