Covid New Variant : కొవిడ్ కేసుల సంఖ్య కొన్ని దేశాల్లో పెరుగుతున్న నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రతి విమానంలో 2% మంది ప్రయాణికులకు విమానాశ్రయాల్లో పరీక్షలు నిర్వహించాలని కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ గురువారం పౌరవిమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్ బన్సల్‌కు లేఖ రాశారు.
"ప్రయాణికుల్లో పరీక్షలు ఎవరికి నిర్వహించాలన్నది సంబంధిత విమానయాన సంస్థలు గుర్తిస్తాయి. వేర్వేరు దేశాలనుంచి వచ్చే ప్రయాణికులకు ఇందులో ప్రాధాన్యం ఇవ్వాలి. ఎంపిక చేసిన ప్రయాణికులు నమూనాలు ఇచ్చి ఇంటికి వెళ్లిపోవచ్చు. ఎవరికైనా పాజిటివ్ వస్తే ఆ నివేదికను ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్‌కి, విమానాశ్రయ ఆరోగ్య అధికారికి, సంబంధిత రాష్ట్రానికి పంపాలి. పాజిటివ్ నమూనాలను జన్యు పరిణామక్రమ విశ్లేషణ కోసం ఇన్సాకాగ్ ప్రయోగశాలలకూ పంపాలి. ఈ కొత్త నిబంధనలు 24వ తేదీ ఉదయం 10 గంటలనుంచి అమల్లోకి వస్తాయి. పరీక్షలను పౌరవిమానయానశాఖ సమన్వయం చేయాలి. ఖర్చులను కేంద్ర వైద్యఆరోగ్యశాఖ తిరిగి చెల్లిస్తుంది. అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఒకే ధరకు పరీక్షలు నిర్వహించేలా పౌరవిమానయానశాఖ చర్యలు తీసుకోవాలి" అని రాజేష్‌భూషణ్ ఈ లేఖలో కోరారు. అత్యంత ప్రమాదకరమైన ఎక్స్‌బీబీ వేరియంట్ మన దేశంలో వేగంగా వ్యాపిస్తోందంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఖండించింది. ఇది తప్పుడు సమాచారమని తెలిపింది.
చర్యలు చేపడుతున్న రాష్ట్రాలు
కరోనాపై కేంద్రం మార్గదర్శకాల నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు చర్యలు చేపట్టాయి. సన్నద్ధతపై సమీక్షలు నిర్వహించాయి. ఇన్‌ఫ్లుయెంజా తరహా అస్వస్థత ఉన్నా, తీవ్రస్థాయి శ్వాసకోశ సమస్యలున్నా అలాంటివారికి తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. బూస్టర్ డోసులకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం తమ అధికారుల్ని ఆదేశించింది. క్రిస్మస్ వేడుకలపై ఎలాంటి ఆంక్షలు విధించడం లేదని పశ్చిమబెంగాల్ తెలిపింది. బూస్టర్ డోసులపై ఎక్కువ రాష్ట్రాలు దృష్టిపెడుతున్నాయి.
'లాక్‌డౌన్ పరిస్థితి రాదు'
దేశంలో అర్హులైనవారిలో 95 శాతం మందికి ఇప్పటికే కొవిడ్ టీకా పూర్తయిన నేపథ్యంలో లాక్‌డౌన్ వంటి పరిస్థితి రాదని 'భారత వైద్యుల సంఘం' (ఐఎంఏ) ప్రతినిధి డాక్టర్ అనిల్ గోయల్ తెలిపారు. చైనా ప్రజలకంటే భారతీయుల్లో రోగనిరోధక శక్తి అధికంగా ఉందని చెప్పారు. ఈమేరకు ఓ వార్తాసంస్థ ఇంటర్వ్యూలో చెప్పారు.
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏర్పాట్లు
విదేశాల నుంచి వచ్చే విమాన ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహించేందుకు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విమానాశ్రయానికి నిత్యం 60-65 విమానాల్లో 14-15 వేల మంది ప్రయాణికులు వివిధ దేశాల నుంచి వస్తుంటారు. నమూనాల సేకరణ, పరీక్షల నిర్వహణ బాధ్యతను ప్రత్యేకంగా ల్యాబ్‌కు అప్పగించే విషయమై శుక్రవారం విమానాశ్రయ అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరికీ థర్మల్ స్క్రీనింగ్ చేయనున్నారు.
ఒమిక్రాన్ గుప్పిట్లో చైనా
చైనాలో కొవిడ్ వ్యాప్తి తీవ్రంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్ నెమ్మదిగా సాగుతుండటం వల్ల దుర్బల స్థితిలో ఉన్నవారికి మరింతగా ముప్పు ఉంటుందని సంస్థ అధికారులు స్పష్టంచేశారు. ఒమిక్రాన్ రకం ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు.
చైనాలో కేసులు భారీగా పెరుగుతుండటం కఠిన 'జీరో-కొవిడ్' నిబంధనలను సడలించడం వల్ల మాత్రమే కాదని.. తీవ్ర సాంక్రమిక శక్తి ఉన్న ఒమిక్రాన్‌ను కట్టడి చేయడం కష్టసాధ్యమని డబ్ల్యూహెచ్‌వో అత్యవసర సేవల విభాగం అధిపతి డాక్టర్ మైఖేల్ ర్యాన్ తెలిపారు. దీని ప్రభావం నుంచి తప్పించుకొనే వ్యూహం వ్యాక్సినేషన్ మాత్రమేనని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
'కొవిడ్ పేరుతో యాత్రను ఆపేందుకు ప్లాన్'.. కేంద్రంపై రాహుల్ ఫైర్!
కొత్త వేరియంట్ భయాలు.. మళ్లీ లాక్‌డౌన్ ఉంటుందా?.. ఆ ఫేక్ న్యూస్‌లతో జాగ్రత్త