కరోనా టీకా లబ్ధిదారుల సంఖ్యను పెంచాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. రోజువారి సెషన్లను మరింత సమర్థంగా నిర్వహించాలని పేర్కొంది. ఈ మేరకు సమీక్ష సమావేశం నిర్వహించిన కేంద్ర ఆరోగ్య శాఖ.. ఫిబ్రవరి చివరి వారం నుంచి కరోనా ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకా పంపిణీ ప్రారంభించాలని స్పష్టం చేసింది.
"పలు రాష్ట్రాల్లో టీకా తీసుకున్న లబ్ధిదారుల కవరేజీ 50 శాతం కన్నా కాస్త ఎక్కువ ఉంది. ఆయా రాష్ట్రాలన్నీ కవరేజీని పెంచాలి. ఈ విషయంలో చాలా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ పనితీరు మెరుగుపర్చుకోవాలి. కరోనా టీకా డోసులు కావాల్సినన్ని నిల్వ ఉన్నాయి. కొవిడ్ యాప్‌లో సాంకేతిక సమస్యలన్నీ పరిష్కారమయ్యాయి."
-కేంద్ర వైద్య శాఖ కార్యదర్శి, రాజేష్ భూషణ్
క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకొని, వాటిని వెంటనే పరిష్కరించేందుకు రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని రాజేష్ సూచించారు. తరచుగా సమీక్షా సమావేశాలు నిర్వహించాలని కోరారు. ఒక్కో సెషన్లో ఇచ్చే టీకాల సంఖ్యను మరింత పెంచడానికి తగినంత ఆస్కారం ఉందని చెప్పారు. ఈ సంఖ్యను పెంచాలని పేర్కొన్నారు.
"సాధ్యమైన వైద్య కేంద్రాల్లో ఒకటికి మించి వ్యాక్సినేషన్ సెషన్లను నిర్వహించాలి. ఇలా చేయడం వల్ల రోజువారి వ్యాక్సినేషన్ సంఖ్య పెరుగుతుంది. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సంబంధిత సెషన్ల నోడల్ అధికారులతో సంప్రదించి.. ఈ సంఖ్యను పెంచేందుకు ప్రయత్నించాలి."
-కేంద్ర వైద్య శాఖ కార్యదర్శి, రాజేష్ భూషణ్
ప్రాధాన్య జాబితాలో ఉన్న వ్యక్తులకే టీకా ఇవ్వాలని స్పష్టం చేశారు భూషణ్. వారిని జాగ్రత్తగా గుర్తించాలని అన్నారు. లబ్ధిదారులకు తొలి డోసు ఇచ్చిన తర్వాత ప్రొవిజనల్ డిజిటల్ ధ్రువీకరణ పత్రం, రెండో డోసు తర్వాత ఫైనల్ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా జారీ చేయాలని సూచించారు.
ఇదీ చదవండి: బెడిసికొడుతున్న చైనా వ్యూహం-భారత్‌దే పైచేయి!