కరోనా టీకా ఉత్పత్తిని పెంచేందుకుగాను సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ సంస్థలకు రూ. 4వేల 500కోట్ల రుణం మంజూరు చేసేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. సీరంకు రూ. 3వేల కోట్లు, భారత్ బయోటెక్‌కు రూ. 1500 కోట్లు మంజూరయ్యాయి. ఈ మొత్తాలు త్వరలోనే విడుదలవుతాయని ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి.
టీకా ఉత్పత్తిని నెలకు పది కోట్లకుపైగా డోసులు పెంచేందుకుగాను 3వేల కోట్ల రూపాయల గ్రాంటు మంజూరు చేయాలని సీరం సీఈఓ అదర్ పూనావాలా విజ్ఞప్తి చేసిన కొన్నిరోజులకే కేంద్రం సానుకూలం నిర్ణయం తీసుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది.
టీకా తయారీ సంస్థలకు ఆర్థిక సాయం అందించటం సహా ఉత్పత్తి సామర్థ్యం పెంచేందుకు అవసరమైన నూతన ఆవిష్కరణలపై కేంద్రం దృష్టిసారించిందని సీరం సీఈఓ అదర్ పూనావాలా ఇటీవల పేర్కొన్నారు.
ఇదీ చదవండి : సైకత శిల్పంతో 'మాస్క్'పై అవగాహన