2021 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. అంతర్జాతీయ నేత నుంచి దేశంలో వివిధ రంగాల్లో సేవలందించిన వారికి ఈ అవార్డు దక్కింది.
పద్మవిభూషణ్..
ఈ ఏడాది మొత్తం ఏడుగురికి పద్మవిభూణ్ పరస్కారం దక్కింది. వారిలో జపాన్ మాజీ ప్రధాని షింజో అబే ఉండటం విశేషం. జపాన్-భారత్ బంధం బలోపేతానికి ఆయన చేసిన కృషికి గుర్తుగా కేంద్రం ఈ అవార్డు అందించింది.
దివంగత దిగ్గజ గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యానికి కూడా పద్మవిభూషణ్‌ను ఇచ్చింది కేంద్రం. సినీ-సంగీత రంగానికి ఆయన చేసిన సేవకు గుర్తుగా.. ఈ అవార్డును అందించింది.
ఈ జాబితాలో వైద్య రంగానికి చెందిన కర్ణాటకవాసి డా. బెల్లె మొనప్ప హెగ్డే, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రంగానికి చెందిన దివంగత శ్రీ నరిందర్ సింగ్ కపానీ, ఆధ్యాత్మికంలో దిల్లీవాసి మౌలానా వాహిదుద్దిన్ ఖాన్, ఆర్కియలాజీలో దిల్లీకి చెందిన శ్రీ బీబీ లాల్, ఆర్ట్‌లో ఒడిశావాసి సుదర్శన సాహోకు పద్మ విభూషణ్ వరించింది.
పద్మ భూషణ్..
మాజీ లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ప్రధానికి మాజీ ప్రధాన కార్యదర్శి నృపింద్ర మిశ్రా, కేంద్ర మాజీ మంత్రి దివంగత రామ్ విలాస్ పాశవాన్, అసోం మాజీ ముఖ్యమంత్రి దివంగత తరుణ్ గొగొయి, మతగురువు దివంగత కల్బి సాదిఖ్లకు పద్మ భూషణ్ అందించింది.
పద్మ శ్రీ..
102మందిని 2021 పద్మ పురస్కారంతో సత్కరించింది కేంద్రం.
ఈ ఏడాది మొత్తం మీద 119మందిని పద్మ అవార్డులు వరించాయి.