నూతన పార్లమెంటు భవనం సెంట్రల్ విస్టాలో మూడు సొరంగ మార్గాలు ఉండనున్నాయి. ప్రధాని, ఉప రాష్ట్రపతి నివాసాలతో పాటు.. ఎంపీల ఛాంబర్లకు నేరుగా వెళ్లేందుకు వీలుగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు.
ప్రముఖులు పార్లమెంటుకు రాకపోకలు సాగించే క్రమంలో రహదారులపై వాహనాల రద్దీ ఏర్పడుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు వీలుగా సెంట్రల్ విస్టా నుంచి భూగర్భ మార్గాలను ఏర్పాటు చేయనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇవన్నీ సింగిల్ లైన్ రహదారులుగానే ఉంటాయని, రాష్ట్రపతి భవన్ దూరంగా ఉన్నందున, అక్కడికి భూగర్భ మార్గాన్ని వేయడం లేదని వెల్లడించాయి.
సెంట్రల్ విస్టా పునర్ అభివృద్ధి ప్రణాళిక ప్రకారం- రైసినా హిల్స్ సౌత్ బ్లాక్ వైపు ప్రధాని నివాసం, కార్యాలయాలను నిర్మిస్తారు. నార్త్ బ్లాక్ వైపు ఉప రాష్ట్రపతి కొత్త నివాసం ఉండనుంది. ప్రస్తుతమున్న ట్రాన్స్‌పోర్ట్ భవన్, శ్రమశక్తి భవన్‌ల స్థానంలో ఎంపీల ఛాంబర్లు ఉండనున్నాయి.
ఇదీ చదవండి: కొత్త పార్లమెంటు నిర్మాణ పనులు షురూ