Central Government on Girls and Women Missing: దేశంలో బాలికలు, మహిళల అదృశ్యంపై కేంద్రం కీలక విషయాలను వెల్లడించింది. దేశంలో 2019-21 మధ్య 13 లక్షల మంది అదృశ్యం అయ్యారని తెలిపింది. మొత్తంగా మూడేళ్ల కాలంలో 25,255 మంది బాలికలు, 10.61 లక్షల మంది మహిళలు అదృశ్యం అయినట్లు కేంద్రం ప్రకటించింది.
ఏపీలో ఎంతమంది అంటే..?: ఏపీ, తెలంగాణలో బాలికలు, మహిళల అదృశ్యంపై కేంద్రం ప్రకటన చేసింది. ఏటా ఏపీలో వేలాది బాలికలు, మహిళలు అదృశ్యం అవుతున్నారని హోంశాఖ పేర్కొంది. ఈ మేరకు రాజ్యసభలో కేంద్ర హోంశాఖ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది. 18 ఏళ్లలోపు బాలికలు, మహిళల అదృశ్యంపై నమోదైన కేసుల వివరాలను కేంద్రం వెల్లడించింది. ఇందులో 2019-21 వరకు ఏపీలో 7,928 మంది బాలికలు, 22,278 మంది మహిళలు అదృశ్యం అయ్యారని కేంద్రం తెలిపింది.
ఏటా పెరుగుతున్నాయి: ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ కీలక వ్యాఖ్యలు చేసింది. ఏటా బాలికలు, మహిళల అదృశ్యం కేసులు పెరుగుతున్నాయని పేర్కొంది. రాజ్యసభ ఎంపీలు అడిగిన ప్రశ్నలకు గాను.. హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌మిశ్రా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
తెలంగాణలో సైతం భారీగానే..: బాలికలు, అదృశ్యం విషయంలో తెలంగాణలో కూడా భారీగా కేసులు నమోదయ్యాయి. 2019-2021 మధ్య రాష్ట్రంలో 8,066 మంది బాలికలు, 34,495 మహిళలు అదృశ్యం అయ్యారని కేంద్రం తెలిపింది. ఏటా వేలమంది అదృశ్యం అవుతున్నారని పేర్కొంది.
కాగా గత కొంత కాలంగా ఏపీలో బాలికల, మహిళలు అదృశ్యంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్న క్రమంలో.. ప్రస్తుతం కేంద్రం లెక్కలను వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరోసారి ఈ విషయం ప్రాధాన్యత సంతరించుకుంది.