Central Cabinet Expansion Latest Update : రాష్ట్ర బీజేపీలో ఆ పార్టీ జాతీయ నాయకత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. మరికొన్ని నెలల్లో శాసనసభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్థానంలో కేంద్ర పర్యాటకశాఖ మంత్రి, సీనియర్ నాయకుడు గంగాపురం కిషన్‌రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించింది. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇటీవల ప్రత్యేక దృష్టి సారించిన బీజేపీ అగ్రనాయకత్వం కీలక కసరత్తులు చేసింది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా, అగ్రనేత బి.ఎల్.సంతోష్‌లు వరుసగా రాష్ట్రంలో పార్టీ పరిస్థితులపై చర్చించారు.
కేబినేట్ విస్తరణ దృష్ట్యా దిల్లీలో రాష్ట్ర నేతలు : నేతల మధ్య విభేదాలు, బండి సంజయ్ మూడేళ్ల పదవీకాలం పూర్తికావడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని.... కీలక సమయంలో కిషన్‌రెడ్డికి రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యత అప్పగించడమే సరైన చర్యగా భావించి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు త్వరలో కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ జరుగుతుందనే ప్రచారం జరుగుతున్న వేళ.... తెలంగాణ తాజా మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా కార్యాలయానికి వెళ్లారు. అదేవిధంగా ఆదిలాబాద్ ఎంపీ బాపురావు బీజేపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. కేబినేట్ విస్తరణ ఊహాగానాల దృష్ట్యా బాపురావును పిలిచినట్లు సమాచారం.
బండి సంజయ్‌కు ఏ హోదా కట్టబెట్టనుందంటే : మరోవైపు.... బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా నియమించింది. రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలు అందించిన సంజయ్‌కు సముచిత ప్రాధాన్యం కల్పించాలని బీజేపీ నిర్ణయించినట్లు సమాచారం. ఆయన నేతృత్వంలో వివిధ ఉప ఎన్నికలను ఎదుర్కోవడం కీలకమైన హుజూరాబాద్, దుబ్బాక ఎన్నికలు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు, జీహెచ్‌ఎంసీలో 48 స్థానాల్లో గెలుపువంటి అంశాల నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో అసంతృప్తికి అవకాశంలేకుండా మార్పు చేయాలని అగ్రనాయకత్వం నిర్ణయించిందని పార్టీ నేతలు పేర్కొన్నారు. కేంద్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించడం లేదంటే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వంటి కీలక బాధ్యత అప్పగించడంపై బీజేపీ దృష్టిసారించిందని చెబుతున్నారు.
కేంద్ర మంత్రివర్గంలో వీరికి స్థానం దక్కే అవకాశం : బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి వచ్చి చేరిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి పార్టీ పదవుల్లో కీలక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిసింది. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు కూడా కొంతకాలంగా అసంతృప్తితో ఉంటూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. కేంద్ర జాతీయ నాయకత్వంలో సంజయ్‌కు అవకాశం కల్పిస్తే సంజయ్ సామాజికవర్గానికి చెందిన ఎంపీ ధర్మపురి అర్వింద్ లేదా రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ లేదా ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావుల్లో ఒకరికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇవీ చదవండి :