త్రివిధ దళాల కార్యకలాపాలను మరింతగా సమీకృతం చేసే దిశగా భారత్ గురువారం ఒక ముందడుగు వేసింది. ముంబయిలో సైనికదళాల ఉమ్మడి సామగ్రి కేంద్రం ప్రారంభమైంది. 'జాయింట్ లాజిస్టిక్స్ నోడ్' (జేఎల్‌ఎన్) అనే కేంద్రాన్ని త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఇందులో సైన్యం, వైమానిక దళం, నౌకాదళానికి సంబంధించిన చిన్నపాటి ఆయుధాల మందుగుండు సామగ్రి, సరకులు, ఇంధనం, సాధారణ వస్తువులు, పౌర రవాణా వ్యవస్థ, వైమానిక దుస్తులు, విడిభాగాలు, ఇంజినీరింగ్ తోడ్పాటు వంటివి లభించనున్నాయి.
"మూడు దళాల సరకు, సామగ్రి సరఫరా వ్యవస్థను అనుసంధానించే దిశగా ఇది చాలా ముఖ్యమైన అడుగు. ఇతర విభాగాల పరిమితులను అర్థం చేసుకోవడం, పరస్పర బలాలు, అత్యుత్తమ విధానాల నుంచి నేర్చుకోవడం వల్ల జేఎల్‌ఎన్‌ల సమర్థత పెరుగుతుంది."
-త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్
భవిష్యత్ యుద్ధాలను త్రివిధ దళాలు.. ఉమ్మడిగా పోరాడాల్సి ఉంటుందని జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. దాన్ని సాధించాలంటే సామగ్రి తోడ్పాటు వ్యవస్థ పటిష్ఠంగా ఉండాలని చెప్పారు. జేఎల్‌ఎన్ వల్ల వనరులను పొదుపుగా వాడుకోవచ్చని, ఫలితంగా డబ్బు ఆదా అవుతుందని రక్షణ శాఖ తెలిపింది.
ఇదీ చూడండి:భరతమాత సేవకై.. తుపాకీ పట్టిన నారీమణులు