సీబీఎస్ఈ పదవ తరగతి ఫలితాల్లో 99.04శాతం ఉత్తీర్ణత నమోదైంది. సీబీఎస్ఈ బోర్డు మంగళవారం ఫలితాలను విడుదల చేయగా, బాలుర కంటే బాలికల్లో 0.35శాతం ఎక్కువ ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం విద్యార్ధుల్లో 57,000 మంది 95 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించారు. 2లక్షల మంది విద్యార్ధులు 90 నుంచి 95 శాతం మార్కులు సొంతం చేసుకున్నారు.
ఈ ఏడాది సీబీఎస్ఈ మెరిట్ జాబితాను ప్రకటించలేదు. ఇంకా 16,000 మంది విద్యార్ధుల ఫలితాలను ప్రకటించాల్సి ఉంది. కరోనా రెండో దశ కారణంగా ఈ ఏడాది సీబీఎస్ఈ పది, 12వ తరగతి పరీక్షలను రద్దు చేశారు. ప్రత్యామ్నాయ మదింపు విధానం ద్వారా మార్కులను లెక్కించారు. ఇందులో భాగంగా 20 మార్కులను అంతర్గత సమీక్ష ద్వారా, 80 మార్కులను విద్యార్ధి ఏడాదిలో నిర్వహించిన వివిధ పరీక్షల్లో చూపిన ప్రతిభ ఆధారంగా కేటాయించారు.
సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్లు cbseresults.nic.in, cbse.nic.inలతో పాటు డిజిలాకర్ యాప్‌లోనూ తెలుసుకోవచ్చు. ఫలితాలు పొందేందుకు విద్యార్థులు తమ రోల్ నంబర్‌తో పాటు స్కూల్ నంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి:సీబీఎస్ఈ క్లాస్-12 ఫలితాలు విడుదల.. బాలికలే టాప్