Karti chidambaram China visa case: చైనీయులు వీసాలు పొందడంలో సాయం చేశారని కార్తీపై ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం దిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ఈ వ్యవహారంపై కార్తీ చిదంబరంను సీబీఐ అధికారులు విచారించనున్నారు. విచారణ నేపథ్యంలో కార్యాలయానికి వెళ్లేముందు కార్తీ స్పందించారు. తనపై పెట్టిన కేసులన్నీ బోగస్ అని.. తాను ఒక్క చైనా జాతీయుడికి కూడా వీసాలు ఇప్పించలేదని స్పష్టం చేశారు. 263 మంది చైనా సంతతికి చెందిన వ్యక్తులకు అక్రమ వీసాలు మంజూరు చేయించిన వ్యవహారంలో గత వారం కార్తీపై కేసు నమోదైంది.
విచారణలో పాల్గొనాల్సిందిగా గతంలో కార్తీ చిదంబరానికి సమన్లు జారీ చేసింది. బుధవారం ఉదయం 11 గంటలకు దిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు రావాలని స్పష్టం చేసింది. అయితే, బుధవారం ఉదయం కార్తీ చిదంబరం తరపు న్యాయవాది సీబీఐ ప్రధాన కార్యాలయానికి వచ్చారని అధికారులు తెలిపారు. న్యాయవాదిని విచారించాల్సిన అవసరం లేదని.. కార్తీ చిదంబరమే స్వయంగా రావాలని చెప్పి పంపినట్లు వెల్లడించారు.
సుమారు రూ. 50 లక్షలు తీసుకుని.. చైనాకు చెందిన 250 మందికి కార్తీ చిదంబరం వీసాలు ఇప్పించారన్నది ప్రధాన ఆరోపణ. కార్తీ తండ్రి చిదంబరం కేంద్ర హోంమంత్రిగా ఉన్న సమయంలో ఈ వ్యవహారం జరిగిందని సీబీఐ వెల్లడించింది. 'చైనా సంస్థలోని 263 ప్రాజెక్ట్ వీసాలను గడువు ముగిసినా మళ్లీ ఉపయోగించుకునేలా చేశారు. సాధారణంగా వీసాను పునర్వినియోగించుకోవాలంటే హోంమంత్రి అనుమతి అవసరం. అప్పటి హోంమంత్రి వీటిని అనుమతించినట్లు తెలుస్తోంది. అప్పటి హోంమంత్రి చిదంబరంతో చర్చించి రూ.50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు" అని సీబీఐ తన ఎఫ్ఐఆర్లో పేర్కొంది. దీనిపై దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. చిదంబరం సన్నిహితుడు, ఈ కేసుతో సంబంధం ఉన్న భాస్కర రామన్ను గత వారం అదుపులోకి తీసుకుంది.
ఇదీ చదవండి: చిదంబరం మెడకు మరో ఉచ్చు.. వీసా కుంభకోణంపై ఈడీ కేసు