CBI Arrested Gail Director: లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై గెయిల్ మార్కెటింగ్ డైరెక్టర్ ఈఎస్ రంగనాథన్‌ను సీబీఐ అరెస్టు చేసింది. పెట్రో కెమికల్ ఉత్పత్తులను డిస్కౌంట్‌కు విక్రయించేందుకు ప్రైవేటు కంపెనీల నుంచి రూ.50 లక్షలు లంచం తీసుకున్నారన్న ఆరోపణలతో ఇటీవల కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురిని అరెస్టు చేసింది.
ఈ కేసు విచారణలో భాగంగా దిల్లీ-ఎన్సీఆర్లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది సీబీఐ. రంగనాథన్ నివాసాల్లోనూ సోదాలు నిర్వహించింది. ఆయన ఇళ్లలో నుంచి ఇప్పటివరకు రూ.1.29 కోట్ల నగదు, బంగారం, పలు విలువైన వస్తువులను స్వాధీనం చేసుకుంది.
Bribery Case On GAIL Director: రంగనాథన్‌తో పాటు పవన్ గౌర్, రాజేశ్ కుమార్, ఎన్ రామకృష్ణన్ నాయర్ అనే ముగ్గురు మధ్యవర్తులపై కేసు నమోదు చేసింది. వ్యాపారవేత్త సౌరభ్ గుప్తా, ఆయన కంపెనీ యునైటెడ్ పాలీమర్స్ ఇండస్ట్రీస్.. ఆదిత్య బన్సల్, అతడి కంపెనీ అయిన బన్సల్ ఏజెన్సీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
"ఉత్పత్తులను డిస్కౌంట్‌కు విక్రయించాలని ప్రైవేటు కంపెనీ ప్రతినిధి తరఫున ఓ మధ్యవర్తి .. గెయిల్ మార్కెటింగ్ డైరెక్టర్‌ను ఆశ్రయించాడు. బదులుగా లంచం ఇస్తానని మధ్యవర్తి చెప్పాడు. గెయిల్ మార్కెటింగ్ మేనేజర్ తరఫున మధ్యవర్తి రూ.10 లక్షలు లంచం తీసుకున్నాడు. ఈ వ్యవహారంలో ఆ మధ్యవర్తి, ప్రైవేటు కంపెనీ డైరెక్టరేట్‌ను అదుపులోకి తీసుకున్నాం. అనంతరం దిల్లీ, నోయిడా, గురుగ్రామ్, పంచకులా, కర్నాల్ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాం. అనంతరం రూ.84 లక్షలు స్వాధీనం చేసుకున్నాం. రంగనాథన్ నివాసాల్లో సోదాలు కొనసాగుతున్నాయి."
-సీబీఐ
పవన్, రాజేశ్‌లతో కలిసి రంగనాథన్.. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడ్డాడని సీబీఐ ఆరోపించింది. వీరిద్దరూ రంగనాథన్‌కు మధ్యవర్తులుగా వ్యవహరించారని పేర్కొంది. ప్రైవేటు కంపెనీల నుంచి లంచం తీసుకొని రంగనాథన్‌కు ఇచ్చేవారని ఎఫ్ఐఆర్లో వివరించింది. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది.
ఇదీ చదవండి: Punjab Elections 2022: ఎన్నికలు వాయిదా వేయండి.. ఈసీకి సీఎం లేఖ