Viveka murder case latest updates: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి.. సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) దర్యాప్తును వేగవంతం చేసింది. దర్యాప్తులో భాగంగా రెండు రోజులక్రితం కడప ఎంపీ అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడైన ఉదయ్ కుమర్ రెడ్డిని అరెస్ట్ చేయగా.. ఈరోజు పులివెందులలో భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్రమైన ఉత్కంఠ మొదలైంది. అయితే, వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటివరకూ ఎంతమందిని అధికారులు అరెస్ట్ చేశారు..? అనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
సీబీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. 2019 మార్చి 15వ తేదీన మాజీమంత్రి వివేకానంద రెడ్డి తన స్వగృహంలో హత్యకు గురయ్యారు. మొదటగా ఆయన గుండెపోటుతో మరణించారని ప్రచారం జరిగినప్పటికీ.. పోలీసుల దర్యాప్తులో వివేకాను హత్య చేసినట్లు తేలింది. ఈ క్రమంలో వివేకా హత్యకు సంబంధించిన దర్యాప్తు మొదలైన రోజు నుంచి అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇటీవలే దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) వివేకా హత్య కేసు దర్యాప్తును ఇంకెన్నాళ్లు చేస్తారంటూ సీబీఐపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 30లోపు కేసు విచారణను పూర్తి చేయాలని సీబీఐకీ కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పటివరకు ఎంతమందిని అరెస్ట్ చేశారంటే..?.. వివేకా హత్య కేసులో ఇప్పటివరకు.. 2021 ఆగస్టు 2న A2 సునీల్ యాదవ్, 2021 సెప్టెంబర్ 9న A3 ఉమాశంకర్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. ఈ కేసులో A-1 ఎర్ర గంగిరెడ్డి డీఫాల్ట్ బెయిల్‌పై ఉండగా.. A4 డ్రైవర్ దస్తగిరి అప్రూవర్‌గా మారి ముందస్తు బెయిల్‌పై ఉన్నారు. నలుగురు నిందితులతో.. 2021 అక్టోబర్ 26న పులివెందుల కోర్టులో CBI మొదటి ఛార్జిషీట్ దాఖలు చేసింది. మొదటి ఛార్జిషీట్‌లో గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరిలపై అభియోగాలు మోపింది. ఆ తర్వాత 2021 నవంబర్ 17న A5 దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ.. 2022 ఫిబ్రవరి 3న పులివెందుల కోర్టులో అనుబంధ ఛార్జిషీట్ వేసింది. ఇందులో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని ఏ5గా చేర్చుతూ అభియోగాలు పొందుపర్చింది. రెండు రోజుల క్రితం.. గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని, ఈరోజు ఉదయం పులివెందులలో భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.
సాక్ష్యాలు చెరిపేయడంలో భాస్కర్ రెడ్డి పాత్ర.. వివేకా హత్య కేసులో గతంలోనే భాస్కర్ రెడ్డి ప్రశ్నించిన CBI అధికారులు.. హత్య కేసులో కుట్రదారుడిగా భాస్కర్ రెడ్డిపై అభియోగాలు నమోదు చేశారు. వైఎస్ వివేకా గుండెపోటుతో మరణించినట్లు ప్రచారం చేయడంలో భాస్కర్ రెడ్డి పాత్ర ఉన్నట్లు సీబీఐ అభియోగం మోపింది. సాక్ష్యాలు చెరిపేయడంలోనూ భాస్కర్ రెడ్డి పాత్ర ఉన్నట్లు పేర్కొంది. వివేకా హత్యకు ముందు రోజు.. 2019 మార్చి 14వ తేదీ సాయంత్రం 6 గంటల 14 నిమిషాల నుంచి 6 గంటల 31 నిమిషాల వరకు భాస్కర్ రెడ్డి ఇంట్లోనే సునీల్ ఉన్నాడని.. గూగుల్ టేక్‌ఔట్ ద్వారా ఆధారాలున్నాయని సీబీఐ తెలిపింది. కదిరి వెళ్లి దస్తగిరి గొడ్డలి తెచ్చే వరకూ.. భాస్కర్ రెడ్డి ఇంట్లోనే సునీల్ ఉన్నారని సీబీఐ వెల్లడించింది. ఇంట్లో సునీల్ ఉన్న సమయంలో తన రెండు ఫోన్లు భాస్కర్ రెడ్డి స్విచ్ ఆఫ్ చేశారని కూడా పేర్కొంది.
వివేకాను హత్య చేయడానికి కారణాలెంటీ..?.. అయితే.. వివేకానంద రెడ్డిని హత్య చేయడానికి గల కారణాలపై సీబీఐ లోతైన దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో MLC ఎన్నికల్లో వివేకా ఓటమిలో భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి కీలక పాత్ర ఉందని సీబీఐ అభియోగాల్లో నమోదు చేసింది. ఓటమి తర్వాత భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, దేవి రెడ్డిపై వివేకా మండిపడ్డారని.. వివేకా వైఎస్సార్సీపీలో ఉంటే తమకు రాజకీయ ఎదుగుదల ఉండదని భాస్కర్ రెడ్డి భావించారని CBI వివరించింది. అందుకే వివేకాను రాజకీయంగా అడ్డు తొలగించుకునేందుకే ఆయనను హత్య చేయించి ఉంటారని.. సీబీఐ అభియోగం మోపింది.
ఇవీ చదవండి