పంజాబ్ కాంగ్రెస్ రాజకీయ సంక్షోభంతో(punjab political crisis) కొట్టిమిట్టాడుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర మాజీ సీఎం, పార్టీ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్(amarinder singh news) మాత్రం భాజపా నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. తాజాగా జాతీయ భద్రత సలహాదారు అజిత్ డోభాల్‌తో సమావేశమయ్యారు.
రంగంలోకి కమల్‌నాథ్, అంబికా..
కొద్ది రోజుల క్రితం సీఎం పదవికి రాజీనామా చేసిన కెప్టెన్.. భాజపాలో చేరుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. బుధవారం.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో అమరీందర్ సమావేశమవడం.. ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. దీంతో మేలుకున్న కాంగ్రెస్ పార్టీ.. కెప్టెన్ భాజపాలో చేరకుండా ఉండేలా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. ఈ బాధ్యతను సీనియర్ నేతలు అంబికా సోని, కమల్‌నాథ్‌లకు అప్పగించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఈ నేతలు అమరీందర్ సింగ్‌కు సన్నిహితులు. దీంతో కెప్టెన్‌కు సర్దిచెప్పి తిరిగి కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చేందుకు వీరు ప్రయత్నిస్తున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. అయితే, తన నిర్ణయాన్ని మార్చుకునేందుకు అమరీందర్ సిద్ధంగా లేరని తెలుస్తోంది. కాంగ్రెస్‌లో తనకు జరిగిన అవమానాన్ని.. కమల్‌నాథ్, అంబికా సోనిల వద్ద కెప్టెన్ మరోసారి ప్రస్తావించినట్లు సదరు వర్గాల సమాచారం. మరోవైపు భాజపాలో చేరికపై అమరీందర్ సింగ్ నుంచి మాత్రం ఎలాంటి స్పష్టత రాలేదు.
పంజాబ్ పీసీసీ పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ అనుహ్యంగా రాజీనామా చేయడం వల్ల కాంగ్రెస్ రాజకీయ సంక్షోభంలో(punjab congress news) కూరుకుపోయింది. దీన్ని అవకాశంగా తీసుకుని రాష్ట్రంలో ఎలా అయినా కాషాయ జెండా పాతాలని భాజపా వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: Punjab news Live: పంజాబ్ సీఎంతో సిద్ధూ కీలక భేటీ