UP polls: పీపీఈ కిట్‌లో వచ్చి నామినేషన్ వేసిన ఓ అభ్యర్థి దరఖాస్తు చివరకు తిరస్కరణకు గురయ్యింది. దరఖాస్తును పరిశీలించిన అధికారులు.. సరైన పత్రాలు సమర్పించకపోవడంతో తిరస్కరించినట్లు వెల్లడించారు. విషయం తెలుసుకున్న సదరు అభ్యర్థి అక్కడి కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లి బోరున విలపించాడు. అంతేకాకుండా ఓ కేంద్ర మంత్రితో అధికారులు కుమ్మక్కై తన నామినేషన్ తిరస్కరించారంటూ ఆరోపించాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంయుక్త్ వికాస్ పార్టీకి చెందిన వైద్యరాజ్ కిషన్‌కు తాజాగా ఈ సంఘటన ఎదురైంది.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గానూ వైద్యరాజ్ కిషన్ అనే వ్యక్తి జనవరి 25వ తేదీన పీపీఈ కిట్ ధరించి రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరకు వెళ్లాడు. ఆ సమయంలో శానిటైజర్, థర్మల్ స్కానర్‌లను కూడా తనవెంట తెచ్చుకొన్నాడు. నామినేషన్‌ను పరిశీలించిన అధికారులు మరిన్ని పత్రాలు అవసరమని అతడికి సూచించారు. అయితే, అలా వచ్చిన తనను అధికారులు నామినేషన్ వేయకుండా అడ్డుకున్నట్లు అదేరోజు కిషన్ ఆరోపించాడు. చివరకు అధికారులు కోరిన పత్రాలు తెచ్చి ఇచ్చి నామినేషన్ ప్రక్రియ పూర్తిచేశాడు.
వాటిని పరిశీలించిన ఎన్నికల అధికారులు కిషన్ నామినేషన్‌ను తిరస్కరించినట్లు ఆదివారం వెల్లడించారు. దీంతో కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చిన ఆ వ్యక్తి బోరుమంటూ విలపించాడు. ఓ కేంద్ర మంత్రి సూచనలతోనే అధికారులు తన నామినేషన్ తిరస్కరించారని ఆరోపించాడు. అయితే, అఫిడవిట్‌తో పాటు సరైన పత్రాలు సమర్పించనందువల్లే అతడి నామినేషన్ తిరస్కరణకు గురయ్యిందని జిల్లా ఎన్నికల అధికారి దేవేంద్ర ప్రతాప్ సింగ్ స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి సురేష్ ఖన్నా.. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని కొట్టిపారేశారు.
ఇదిలా ఉంటే, నామినేషన్ వేసిన సంయుక్త్ వికాస్ పార్టీకి చెందిన వైద్యరాజ్ కిషన్.. ఇప్పటివరకు 18 ఎన్నికల్లో పోటీ చేశారు. అన్ని ఎన్నికల్లోనూ ఆయన డిపాజిట్ కోల్పోయారు. ఇక ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ బరిలో దిగనున్న గోరఖ్‌పుర్ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు కిషన్ ఇటీవలే పేర్కొనడం గమనార్హం.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: రాహుల్ గాంధీకి 'మోదీ ఫోబియా': అమిత్ షా