CAG Report on Capital Amaravati: అమరావతిపై సీఎం జగన్ అక్కసును, నిలువెత్తు నిర్లక్ష్యాన్ని, కక్షసాధింపును.. కాగ్ (Comptroller and Auditor General of India) నివేదికలో విస్పష్టంగా పేర్కొంది. 2014 జూన్ నుంచి 2021 సెప్టెంబరు వరకు రాజధాని అమరావతికి సంబంధించిన ఆడిట్ వివరాల్ని నివేదికలో పొందుపరిచింది. అమరావతికి 2015 మార్చి నుంచి 2017 ఫిబ్రవరి మధ్య కేంద్రం 15వందల కోట్లు అందజేసినట్లు వెల్లడించింది. వివిధ దశల్లో రాజధాని నిర్మాణానికి లక్షా 9 వేల 23 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసిన గత ప్రభుత్వం.. 39వేల 937 కోట్ల కోసం 2018 ఆగస్టులో నీతి ఆయోగ్‌కి 33 డీపీఆర్‌లు, 22వేల 686 కోట్లకు 2018 డిసెంబరులో మరో 14 డీపీఆర్‌లు అందజేసిందని తెలిపింది.
తొలివిడతలో ఇచ్చిన 33 డీపీఆర్‌లను 2019 ఏప్రిల్‌లో కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధిశాఖకు పంపిన నీతిఆయోగ్.. సాధ్యాసాధ్యాలు పరిశీలించి అభిప్రాయం చెప్పాలని కోరినట్లు పేర్కొంది. 2019 మేలో ఏపీ పురపాలకశాఖకు అభ్యంతరాల్ని తెలియజేసిన కేంద్ర ప్రజాపనుల విభాగం... సవరించిన డీపీఆర్‌లు పంపాలని సూచించినట్లు వివరించింది. ఎంతకీ పట్టించుకోకపోవడంతో 2022 మేలో నీతిఆయోగ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ విషయాన్ని గుర్తుచేయగా.. 2022 జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం స్పందించినట్లు కాగ్ (CAG Report) తెలిపింది.
Miscalculations to CAG : కాగ్ వద్ద కూడా రాష్ట్ర ప్రభుత్వ అంకెల గారడీ
రాజధాని పనుల్ని ఎక్కడికక్కడ నిలిపివేశారు: జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే రాజధాని పనుల్ని ఎక్కడికక్కడ నిలిపివేశారని కాగ్ గుర్తుచేసింది. ప్రభుత్వ విధానం ప్రకారం అప్పటికే 25శాతం పూర్తయిన పనుల్ని కొనసాగించాల్సి ఉండగా.. ఆ విధానాన్ని రాజధానికి వర్తింపజేయలేదని పేర్కొంది. రాజధానిలో మౌలిక వసతుల పనుల్ని 3 కేటగిరీలుగా విభజించిన సీఆర్డీఏ.. వాటికి 55వేల 343 కోట్లు అవసరమని అంచనా వేసినట్లు తెలిపింది.
ప్రధాన రహదారులు, బ్రిడ్జిల నిర్మాణం, తాగునీరు, మురుగునీటి పారుదల వ్యవస్థ ఏర్పాటుకు 19వేల 769 కోట్లు, ఎల్పీఎస్ లేఅవుట్లలో మౌలిక వసతులకు 17వేల 910 కోట్లు, ప్రభుత్వ భవనాలకు 14వేల 8 కోట్లు కావాలని అంచనా వేసినట్లు తెలిపింది. వాటిలో 33వేల 476.33 కోట్లకు సంబంధించిన 57 ప్యాకేజీల పనులకు టెండర్లు ఖరారు చేసి పనులు అప్పగించిందని.. రాజధాని నిర్మాణం నిలిపివేసే నాటికి ఇంకా 29వేల 385.02 కోట్ల పనులు చేయాల్సి ఉందని పేర్కొంది. 22 ప్యాకేజీలుగా విభజించి 12వేల 824 కోట్ల అంచనాతో ప్రధాన మౌలిక వసతుల పనులు చేపట్టగా... 2021 అక్టోబర్ నాటికి 3వేల 213.41 కోట్లే ఖర్చు చేశారని కాగ్ నివేదికలో స్పష్టంచేసింది.
"రాబడి పెరగట్లేదు.. అప్పులు తీరట్లేదు".. కాగ్ హెచ్చరిస్తున్నా దిద్దుబాటు చర్యల్లేవు
CAG Report on AP Capital: రాజధానికి భూములిచ్చిన రైతులకు కేటాయించిన ఎల్పీఎస్ లేఅవుట్లను 14 జోన్లుగా విభజించారన్న కాగ్.. వాటిలో రెండు జోన్లకు ఇంకా టెండర్లు పిలవలేదని తెలిపింది. మిగతా 12 జోన్లలో మౌలిక వసతుల పనుల్ని 16 ప్యాకేజీలుగా విభజించి.. 13వేల 802.75 కోట్లతో మౌలిక వసతుల అభివృద్ధి పనులు ప్రారంభించారని వెల్లడించింది. అయితే 2021 సెప్టెంబర్ నాటికి 183.04 కోట్లే ఖర్చు పెట్టారని గుర్తుచేసింది.
వృథాగా మారిన నిర్మాణాలు: 6వేల 848.58 కోట్లతో అమరావతి పరిపాలనా నగరంలో గత ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టగా.. షెడ్యూలు ప్రకారం 2021 మార్చి నాటికి పూర్తికావాల్సి ఉందని పేర్కొంది. వీటిని 19 ప్యాకేజీలుగా విభజించగా.. ఆరు ప్యాకేజీల పనులు మాత్రమే 25 నుంచి 95శాతం పూర్తయ్యాయంది. అందులో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఖిలభారత సర్వీసుల అధికారుల నివాస గృహాలు కూడా ఉన్నాయని చెప్పింది. పనుల నిలివేతతో అప్పటికే 15వందల 5.22 కోట్లు వెచ్చించి చేపట్టిన నిర్మాణాలు వృథాగా మారాయని వెల్లడించింది.
రూపాయి కూడా విదల్చలేదు: రాజధానిలో మౌలిక వసతుల నిర్మాణానికయ్యే 55వేల 343 కోట్లలో 11వేల 487 కోట్లను సీఆర్డీఏ వివిధ రూపాల్లో సమీకరించిందని కాగ్ తెలిపింది. 2018-19 నుంచి ఏడేళ్లపాటు ఏటా 18 వందల కోట్ల చొప్పున రాజధానికి ఇచ్చేందుకు 2019 ఫిబ్రవరిలో గత ప్రభుత్వం అంగీకరించగా.. వైసీపీ అధికారంలోకి వచ్చాక రూపాయి కూడా విదల్చలేదని స్పష్టంచేసింది.
ఏపీ బడ్జెట్ తయారీ, నిర్వహణలో కాకి లెక్కల గుట్టువిప్పిన కాగ్
హడ్కో, బ్యాంకుల కన్సార్షియం, బాండ్ల రూపంలో సీఆర్డీఏ 5వేల 13.60 కోట్లు సమీకరించిందని.. కానీ ప్రధాన మౌలిక వసతులు, ఎల్పీఎస్ లేఅవుట్ల అభివృద్ధి పనుల్లో ఆశించిన పురోగతి లేదని కాగ్ పేర్కొంది. పనులు చేసినా, చేయకపోయినా ఈ రుణాలపై 3వేల 428.12 కోట్ల వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని వివరించింది.
కోట్లలో నష్టం: రాజధానిలో 400 కేవీ హైవోల్టేజి లైన్లను దారి మళ్లించేందుకు 491.93 కోట్లతో, 220 కేవీ హైవోల్టేజి లైన్లను భూగర్భంలో వేసేందుకు 883.55 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించిన ఏపీ ట్రాన్స్‌కో... టెండర్లు పిలిచి పనులు అప్పగించిందని కాగ్ పేర్కొంది. 220 కేవీ లైన్లకు ఒక గుత్తేదారు సంస్థ 116.41 కిలోమీటర్ల పొడవైన, 208.67 కోట్ల విలువైన కేబుళ్లను సరఫరా చేసిందని.. జగన్ ప్రభుత్వం రాజధాని పనులు నిలిపివేయడంతో ఆ ప్రతిపాదనను సీఆర్డీఏ రద్దు చేసుకుందని గుర్తుచేసింది.
ఆ కేబుళ్లను మరెక్కడైనా వాడేసుకోమంటూ ట్రాన్స్‌కోకు ఉచిత సలహా ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించింది. కానీ రాష్ట్రంలో మరెక్కడా అలాంటి ప్రాజెక్టు చేపట్టడం లేదని ట్రాన్స్‌కో చెప్పడంతో.. ఆ కేబుళ్లు వృథా అయ్యాయని నివేదికలో పేర్కొంది. 400 కేవీ లైన్లు దారి మళ్లించేందుకు 394.60 కోట్లతో ఒక సంస్థకు ట్రాన్స్‌కో కాంట్రాక్టు అప్పగించగా.. ఇప్పటివరకు 60 కోట్లు ఖర్చు చేసిన వృథాగా మారిందని స్పష్టంచేసింది.
లెక్కలు వెల్లడించిన కాగ్ .. బడ్జెట్‌లో లెక్కచూపని కార్పోరేషన్ రుణాలు ఎంతంటే?
చెప్పుకుంటూ పోతే మరెన్నో..: అమరావతి నిర్మాణాల్లో ప్రభుత్వ వైఫల్యాలను కాగ్ ఎత్తిచూపింది. 163.97 కోట్లతో కొన్న పైపులు వివిధ ప్రాంతాల్లో వృథాగా పడిఉన్నాయని తెలిపింది. రాజధానిని జాతీయ రహదారి-16తో కనకదుర్గ వారధి వద్ద అనుసంధానానికి తలపెట్టిన సీడ్‌యాక్సెస్ రోడ్డు అసంపూర్తిగా మిగిలిందని.. మొత్తం 21.34 కిలోమీటర్ల రోడ్డులో 14.47 కి.మీ.లే పూర్తిచేశారని నివేదికలో వెల్లడించింది.
కృష్ణా నదిపై 13వందల 87 కోట్లతో తలపెట్టిన ఐకానిక్ బ్రిడ్జిని ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేయడంతో... డిజైన్లు, డ్రాయింగ్‌ల కోసం అప్పటికే ఖర్చు పెట్టిన 2.22 కోట్లు వృథా అయ్యాయని పేర్కొంది. అమరావతిలోని శాఖమూరు పార్కులో 1.86 కోట్లతో అంతర్గత రహదారుల నిర్మాణం చేపట్టారని.. ప్రాజెక్టు నిలిపివేతతో అన్నీ వృథాగా మారాయంది. ఎల్పీఎస్ లేఅవుట్లలో పిచ్చిమొక్కలు తొలగించడానికి 10.87 కోట్లు వెచ్చించారని.. పనులు ఆపడంతో నిధులు మట్టిపాలయ్యాయని నివేదికలో వెల్లడించింది.
రాజధానిలో 16 వందల 91 ఎకరాల్లో స్టార్టప్ ఏరియా అభివృద్ధి కోసం సింగపూర్‌కు చెందిన అసెండాస్-సింగ్‌బ్రిడ్జి, సెంబ్‌కార్ప్ సంస్థల కన్సార్షియం, అమరావతి అభివృద్ధి సంస్థ సంయుక్తంగా.. అమరావతి డెవలప్‌మెంట్ పార్ట్‌నర్స్ పేరుతో కంపెనీ ఏర్పాటుచేశాయని కాగ్ తెలిపింది. జగన్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును అర్ధాంతరంగా రద్దు చేసి, ఏడీపీపీఎల్ను లిక్విడేట్ చేయడంతో ప్రభుత్వానికి 11.16 కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలిపింది.
CAG Report: గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు రాజ్యాంగ స్ఫూర్తికి దెబ్బ: కాగ్
ఇండో-యూకే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌కి ఎకరం 50 లక్షల చొప్పున 150 ఎకరాల్ని 2016లో ప్రభుత్వం కేటాయించిందని.. ఆ సంస్థ సీఆర్డీఏకి 24.99 కోట్లు చెల్లించిందని పేర్కొంది. గడువులోగా ప్రాజెక్టు చేపట్టనందుకు 2019 ఏప్రిల్‌లో భూకేటాయింపు రద్దు చేసిన సీఆర్డీఏ.. ఆ సంస్థ విజ్ఞప్తితో జప్తు చేయాల్సిన డబ్బును 2020 జనవరిలో నిబంధనలకు విరుద్ధంగా తిరిగి చెల్లించిందని తెలిపింది.
రాజధానిలో మెటీరియల్, పరికరాలు ఉంచుకోవడానికి గుత్తేదారులకు ఎకరం లక్ష చొప్పున సీఆర్డీఏ లీజుకిచ్చిందని.. 4.09 కోట్ల బకాయి ఉండగా ఆ సంస్థ ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేదంది. 30 పనులకు గుత్తేదారులకు 12వందల 82.83 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్‌గా ఇచ్చారన్న కాగ్.. దానిలో 338.57 కోట్లే రికవర్ చేశారని తెలిపింది. 2021 సెప్టెంబరు నాటికి 944.26 కోట్లు గుత్తేదారుల వద్దే ఉన్నాయంది. రాజధానిలో వివిధ అవసరాలకు మట్టి తవ్వుకున్న గుత్తేదారుల నుంచి 12.83 కోట్లు వసూలు చేయాల్సి ఉందని పేర్కొంది.
CAG Report on Praja Vedika Demolition: ప్రజావేదిక కూల్చివేతతో 11.91 కోట్ల ప్రజాధనం వృథా: కృష్ణా కరకట్టకు, నదికి మధ్యలో 7.85 కోట్లతో సీఆర్డీఏ ప్రజావేదిక నిర్మించిందని.. అనుబంధ వసతుల కోసం మరో 4.06 కోట్లు వెచ్చించిందని నివేదికలో తెలిపింది. నిర్మాణానికి జలవనరులశాఖ, సీఆర్డీఏ ప్రణాళికా విభాగం నుంచి అనుమతులు తీసుకోలేదని స్పష్టంచేసింది. సీఆర్డీఏ ఇంజినీరింగ్ విభాగం ఆ భవనాన్ని నిర్మించిందని.. ప్రస్తుత ప్రభుత్వం దాన్ని కూలగొట్టడంతో మొత్తం 11.91 కోట్ల ప్రజాధనం వృథా అయిందని తెలిపింది.
AP Debts: అందినకాడికి అప్పులు.. 9 నెలల అప్పులు 4 నెలల్లోనే..
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ శత జయంతి వేళ రాజధానిలో 97.69 కోట్ల అంచనాతో 20 ఎకరాల్లో గత ప్రభుత్వం స్మృతివనం తలపెట్టిందని కాగ్ నివేదికలో పేర్కొంది. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహంతో పాటు వసతులు కల్పించాలని నిర్ణయించిందని.. 44.61 కోట్లు ఖర్చుచేశాక పనులు నిలిపివేయడంతో మొత్తం వృథా అయిందని వివరించింది.
రాజధానికి భూములిచ్చిన రైతులకు గత ప్రభుత్వం వార్షిక కౌలు చెల్లించడంతో పాటు.. భూమిలేని పేదలకూ అదనపు వసతులు కల్పించింది. అన్నక్యాంటీన్లు ఏర్పాటుచేసింది. ఆరోగ్యకార్డులు అందజేసింది. వ్యాపారాల కోసం తక్కువ వడ్డీతో రుణాలు, ఇళ్లు లేని పేదలకు గృహవసతి వంటి సదుపాయాలు తలపెట్టింది. ఈ ప్రభుత్వం వచ్చాక అవన్నీ నిలిచిపోయాయి.