రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఖరీఫ్‌లో పంటల మద్దతు ధరల పెంపునకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. 2022-23 ఏడాదికి వరి క్వింటా కనీస మద్దతు ధరను 100 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపుతో ఖరీఫ్‌లో క్వింటా వరి మద్దతు ధర రూ.1,940 నుంచి రూ. 2,040కు పెరిగింది.2022-23 ఏడాదికి ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది.
ఈ భేటీలో 14 ఖరీఫ్ పంటలకు మద్దతు ధరలు ఇచ్చేందుకు ఆమోదం లభించిందని కేంద్ర సమాచార, ప్రసారశాఖమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఏ గ్రేడ్ రకం వరి మద్దతు ధర క్వింటాల్‌కు 1,960 రూపాయల నుంచి 2,060 రూపాయలకు పెంచినట్లు తెలిపారు. పత్తి మద్దతు ధరను రూ.5,726 నుంచి రూ.6080కు..పొడవు పత్తి రకానికి రూ.6,025 నుంచి రూ.6,380కు పెంచింది. కందులపై క్వింటాల్‌కు మద్దతు ధర రూ.300, పెసర్లకు రూ.400, పొద్దు తిరుగుడుపై రూ.385, సోయాబీన్‌పై రూ.300, నువ్వులపై రూ.523 పెంచింది. దీంతో పాటు కందులకు రూ.6600, పెసర్లకు రూ.7,755, మినుములకు రూ.6,600, వేరుశనగ రూ.5,850 చెల్లించనున్నారు.
రైతుల శ్రేయస్సు కోసం అనేక చర్యలు చేపడుతున్నామని.. విత్తనాల నుంచి మార్కెట్ వరకు(బీజ్ సే బజార్) అనే ధృక్పథంతో ముందుకు వెళుతున్నామని మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఖరీఫ్‌కు ముందుగానే ధరలు పెంచడం వల్ల రైతులు ఏ పంట వేయాలో నిర్ణయించుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. నూనెలు, పప్పుల ధరల పెంచడం వల్ల విదేశాల నుంచి దిగుమతి తగ్గిందని వెల్లడించారు.
ఇదీ చదవండి: బోరుబావిలో పడ్డ రెండేళ్ల చిన్నారి.. సురక్షితంగా బయటకు