పూర్వ కాలంలో సమయం చూసేందుకు ప్రజలకు ఎటువంటి పరికరం ఉండేది కాదు. అప్పటి ప్రజలు నీడను చూసి సమయాన్ని అంచనా వేసేవారు. సూర్యుని వెలుతురే వారికి గడియారంగా పనిచేసేది. వెలుతురు ఆధారంగా సమయాన్ని గ్రహించి తమ పనులు చేసుకునేవారు ప్రజలు. కానీ నేటి డిజిటల్ యుగంలో సమయాన్ని చూసేందుకు సూర్యుడిపై ఎవరూ ఆధారపడటంలేదు. టైమ్ చూసేందుకు ప్రతి ఒక్కరికీ గడియారాలు, డిజిటల్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఆధునిక కాలంలో ప్రతి వ్యక్తి సమయాన్ని చూడటానికి వాచ్, మొబైల్ లేదా ఇతర పరికరాలని ఉపయోగిస్తున్నారు. కానీ ఈ సాంకేతిక యుగంలోనూ ప్రాచీన పద్ధతిని గుర్తుకు తెచ్చే అరుదైన వ్యక్తి ఉన్నాడు. ఆ యువకుడు ఎలాంటి వాచీ, మొబైల్‌ను చూడకుండానే కచ్చితమైన సమయాన్ని చెబుతున్నాడు. అతడే మధ్యప్రదేశ్ బుర్హాన్‌పూర్ జిల్లా నేపానగర్కు చెందిన సుఖ్‌లాల్.
వాచ్ చూడకుండానే కరెక్ట్ టైమ్ చెప్పేస్తాడు!
సుఖ్‌లాల్‌కు ఉన్న ఈ ప్రత్యేకమైన కళను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో వాచ్, మొబైల్ చూడకుండా ఎవరూ టైం చెప్పలేరు. కానీ సుఖ్‌లాల్ మాత్రం ఎప్పుడైనా సరే సమయం అడిగితే గడియారం వైపు చూడకుండానే చెప్పేస్తాడు. అందుకే ఆయనను 'నడిచే గడియారం' అని పిలుస్తున్నారు స్థానికులు. సుఖ్‌లాల్ చెప్పే సమయం, గడియారంలోని టైమ్ సరిగ్గా పోలి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈ కళను భగవంతుడి అనుగ్రహంతోనే పొందానని చెబుతున్నాడు సుఖ్‌లాల్.
భిక్షాటన చేస్తూ జీవిస్తున్న సుఖ్‌లాల్!
సుఖ్‌లాల్ ఒంటరిగా జీవిస్తున్నాడు. రైలు, జనసమూహాల్లో భిక్షాటన చేస్తూ కడుపు నింపుకుంటున్నాడు. ఈ కళను ప్రకృతి గడియారం అని పిలుస్తున్నాడు సుఖ్‌లాల్. ఈ గడియారం తనకి మాత్రమే కనిపిస్తోందని.. మరెవరికీ కనిపించదని సుఖ్‌లాల్ తెలిపాడు. దాదాపు 25 ఏళ్లుగా వాచ్ వైపు చూడకుండా టైం చెబుతూనే ఉన్నాడు ఈ 'వాకింగ్ మ్యాన్ వాచ్'.