Bully Bai App Case: బుల్లీ బాయ్ యాప్ కేసులో ప్రధాన నిందితుడైన నీరజ్ బిష్ణోయ్ ఆత్మహత్యాయత్నం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఆత్మహత్య చేసుకుంటానంటూ నిందితుడు రెండు సార్లు తనను తాను గాయపరచుకున్నట్లు పేర్కొన్నారు. నిందితుడు విచారణకు సహకరించట్లేదని తెలిపారు.
15 ఏళ్ల నుంచే..
నీరజ్ బిష్ణోయ్.. 15 ఏళ్ల వయసు నుంచే వెబ్సైట్లను హ్యాక్ చేయడం ప్రారంభించాడని అధికారులు తెలిపారు. ఈ జాబితాలో భారత్, పాకిస్థాన్‌లకు చెందిన పాఠశాలలు, విశ్వవిద్యాలయాల వెబ్సైట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. జిన్యూ అనే జపనీస్ యానిమేషన్ గేమ్ క్యారెక్టర్‌ను ఆదర్శంగా తీసుకుని ఈ దారుణాలకు పాల్పడుతున్నాడని తెలిపారు. ఈ క్రమంలో ట్విట్టర్ ఖాతా తెరిచి భద్రతా సంస్థలకు తనను అరెస్ట్ చేయమంటూ సవాల్ చేసేవాడని వెల్లడించారు.
21 ఏళ్ల బీటెక్ విద్యార్థి నీరజ్ బిష్ణోయ్ కేవలం ఫేమస్ కావాలనే ఉద్దేశంతోనే యాప్‌ను రూపొందించినట్లు చెప్పారు. సొంత గుర్తింపు కోసమే ఈ పని చేసినట్లు అతడు అంగీకరించినట్లు వెల్లడించారు. అయితే నీరజ్‌కు సుల్లీ డీల్స్ కేసుతోనూ సంబంధాలు ఉండే అవకాశముందని పోలీసులు చెప్పారు. సుల్లీ డీల్స్‌పై ఓ మహిళా జర్నలిస్టు పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. కేసు విచారణ గురించి కూపీ లాగేందుకు నీరజ్.. మీడియా ప్రతినిధినని చెప్పి సైబర్ సెల్ పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించాడని వెల్లడించారు.