parliament budget session 2022: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈనెల 31 నుంచి ఏప్రిల్ 8 వరకు జరగనున్నాయి. పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు లోక్‌సభ సెక్రటేరియట్ శుక్రవారం వెల్లడించింది. తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించనున్నారు.
ఫిబ్రవరి 1వ తేదీన కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాల తొలి అర్ధభాగం ఫిబ్రవరి 11న ముగియనుంది. నెల రోజుల విరామం తర్వాత మార్చి 14న తిరిగి ప్రారంభమై.. ఏప్రిల్ 8 వరకు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతోన్న తరుణంలో ఈ సమావేశాలు ప్రారంభం కానుండటం వల్ల.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు.
ఇటీవల పార్లమెంటులో 400 మందికిపైగా సిబ్బందికి పాజిటివ్‌గా వచ్చిన నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల నిర్వహణ తీరుపై రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాలు ఇటీవల అధికారులతో సమీక్షించారు. ఓం బిర్లా.. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌ను తనిఖీ చేశారు. 60ఏళ్లు పైబడిన ఎంపీల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని, వారికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పార్లమెంట్ కాంప్లెక్స్‌లో పరీక్షల నిర్వహణ, టీకాల ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. సమావేశాలు సాఫీగా సాగేలా పార్లమెంటు అన్ని ఏర్పాట్లు చేస్తోందని వెల్లడించారు.
ఇదీ చూడండి : సీడీఎస్ రావత్ చాపర్ క్రాష్‌కు కారణం ఇదే.. వాయుసేనకు కీలక నివేదిక!