రాజస్థాన్ జైసల్మేర్ జిల్లాలోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్‌లో మంగళవారం రాత్రి ప్రమాదవశాత్తు సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్) జవాన్ ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. మరణించిన జవాన్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన 32 ఏళ్ల సతీశ్ కుమార్‌గా గుర్తించారు.
గుజరాత్‌లోని భుజ్ కేంద్రంగా సేవలందించే 1077- బీఎస్ఎఫ్ బెటాలియన్ జవాన్లు పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్‌లో శిక్షణ పొందుతుండగా ఈ ఘటన జరిగింది. వీరు ఉపయోగిస్తోన్న 105ఎంఎం తుపాకీ అనుకున్న లక్ష్యానికి ముందే పేలింది. ఫలితంగా ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఒకరు మరణించారు.
జమ్ములో అధికారి ఆత్మహత్య
జమ్ముకశ్మీర్‌లోని ఖాన్మో ప్రాంతంలో సైనిక స్థావరంలో ఒక ఆర్మీ అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఆర్మీ డిపోలో సేవలందించే లెఫ్టినెంట్ కల్నల్ సుదీప్ భగత్ సర్వీసు తుపాకీతో కాల్చుకున్న ఘటనలో ఆయన అక్కడికక్కడే మరణించారని అధికారులు వివరించారు. ఈ ఘటనకు కారణాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: చలికి తట్టుకోలేక విధుల్లోనే జవాను మృతి