బంగ్లాదేశ్ విముక్తి కోసం 1971 యుద్ధంలో విజయం సాధించి 50 ఏళ్లైన సందర్భంగా సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) నిర్వహించిన 4 వేల కి.మీ సుదీర్ఘ సైకిల్ యాత్ర బుధవారం ముగిసింది. భారత్-బంగ్లా మధ్య స్నేహపూర్వక సంబంధాలకు గుర్తుగా 'మైత్రి సైకిల్ ర్యాలీ' పేరిట చేపట్టిన ఈ యాత్ర.. ఐదు రాష్ట్రాల మీదగా 70 రోజుల పాటు సాగింది.
జనవరి 10 దక్షిణ బంగాల్లోని పానిటార్ బార్డర్ ఔట్‌పోస్టు వద్ద ఈ ర్యాలీ ప్రారంభమైంది. పశ్చిమ మిజోరంలోని సిలికోరే సరిహద్దు ఔట్‌పోస్టు వద్ద ముగిసింది. బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహ్మాన్ 101వ జయంతి రోజునే ఈ ర్యాలీ పూర్తవడం విశేషం.
బీఎస్ఎఫ్, బోర్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్(బీజీబీ) మధ్య సహకారం పెంపొందించేందుకు ఈ సైకిల్ ర్యాలీ నిర్వహించినట్లు బీఎస్ఎఫ్ ప్రతినిధి అశోక్ కుమార్ తెలిపారు. సైకిల్ యాత్ర ద్వారా అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో నివసించే ప్రజలకు తమ భద్రతపై విశ్వాసం పెరుగుతుందని చెప్పారు. 13 మంది బీఎస్ఎఫ్ సైక్లిస్ట్‌లకు బీజీబీ అధికారులు, స్థానిక ప్రజలు, విద్యార్థులు ఎక్కడికక్కడ స్వాగతం పలికారని వెల్లడించారు. ర్యాలీ ముగింపు సందర్భంగా సాంస్కృతిక కార్యకలాపాలను నిర్వహించినట్లు తెలిపారు.
ఫుట్‌బాల్ మ్యాచ్‌లు కూడా
ఇరుదేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను దృష్టిలో ఉంచుకొని 'బీఎస్ఎఫ్-బీజీబీ మైత్రి ఫుట్‌బాల్ మ్యాచ్'లను నిర్వహిస్తామని త్రిపుర ఫ్రాంటియర్ ఐజీ సుశాంత కుమార్ నాథ్ తెలిపారు. త్రిపురతో పాటు బంగాల్, అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో ఈ మ్యాచ్‌లు ఉంటాయని చెప్పారు. ఈ సందర్భంగా ఇతర కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: కాన్పుర్ జైలులో కరోనా కలకలం