Sri Chaitanya Institutions Founder Passed Away : శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత బీఎస్ రావు(75) గుండెపోటుతో కన్నుమూశారు. ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు తన నివాసంలో గుండెపోటు రావడంతో.. హుటాహుటిగా జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. దీంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన భౌతిక కాయాన్ని అపోలో ఆసుపత్రి నుంచి స్వస్థలం విజయవాడలోని తాడిగడపకు తరలించారు. విదేశాల్లో ఉంటున్న కుమార్తె సీమ.. వచ్చిన తర్వాతనే అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబీకులు పేర్కొన్నారు.
శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత ప్రస్తానం : శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత బీఎస్ రావు పూర్తి పేరు బొప్పన సత్యనారాయణ రావు. ఇంగ్లండ్, ఇరాన్లలో బీఎస్ రావు తన సతీమణి ఝాన్సీ లక్ష్మీబాయి 15 ఏళ్లు వైద్యులుగా సేవలందించారు. అనంతరం 1986లో శ్రీ చైతన్య విద్యాసంస్థలను బొప్పన సత్యనారాయణ రావు ప్రారంభించారు. తొలుత విజయవాడలోని పోరంకిలో 56 మందితో బాలికల జూనియర్ కళాశాల ప్రారంభించి.. విజయవాడ నుంచి కళాశాలలను అంచెలంచెలుగా విస్తరించారు. ఇప్పటికీ 321 జూనియర్ కళాశాలలు.. 322 టెక్నో స్కూల్స్ నిర్వహించి అత్యుత్తమ విద్యార్థులను అందిస్తున్నారు. 107 సీబీఎస్ఈ స్కూల్స్‌ను బీఎస్ రావు స్థాపించారు. ఈ శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో దేశవ్యాప్తంగా 8.5 లక్షల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు.
విద్యాసంస్థ స్థాపనకు కుమార్తెల చదువే కారణం : ఇరాన్లో వైద్యునిగా విధులు నిర్వహిస్తున్నప్పుడు.. భారత్‌కు వచ్చి తన కుమార్తెల విద్య కోసం మంచి స్కూల్ కోసం వెతికారు. ఆ క్రమంలో బాలికల కోసం రాష్ట్రంలో ఎక్కడా కళాశాలలు లేవని బీఎస్ రావు ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. పదో తరగతి వరకు బాగా మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు ఇంటర్లో ఎందుకు తగిన ప్రతిభ కనబర్చలేదని ఆలోచించి విద్యాసంస్థల ఏర్పాటు ప్రేరణ అప్పుడే వచ్చిందని తెలిపారు.
Sri Chaitanya Institutions Chairman BS RAO Passed Away : అప్పటి మొదలైన ప్రస్తావన తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు విద్యారంగ రారాజుగా ఎదిగారు. అక్కడితో ఆగకుండా దేశవ్యాప్తంగా బ్రాంచీలు ఏర్పాటు చేసి.. అత్యుత్తమైన విద్యను అందించారు. ఇంటర్ విద్యార్థుల కోసం పోటీ పరీక్షలకు శిక్షణా సంస్థలను ఏర్పాటు చేసి ఐఐటీ, నీట్‌లలో మంచి ర్యాంకులు సాధించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దారు.
బీఎస్ రావు మృతిపట్ల చంద్రబాబు సంతాపం : బీఎస్ రావు మృతి పట్ల టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ట్విటర్ వేదికగా సంతాపం తెలిపారు. ఆయన లేని లోటు విద్యారంగంలో ఎవరూ పూడ్చలేరని, ఎనలేని సేవలు చేశారని గుర్తు చేసుకున్నారు. ఆయన మరణ వార్త విని ఎంతో బాధపడ్డానని చంద్రబాబు తెలిపారు.
ఇవీ చదవండి :