Brother Killed Sister : సొంత సోదరినే దారుణంగా హత్య చేశాడు ఓ యువకుడు. పదునైన ఆయుధంతో ఆమె తలను నరికాడు. అనంతరం ఓ చేతిలో తల, మరో చేతిలో కత్తితో.. నడిరోడ్డుపై నడుచుకుంటూ వెళ్లాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో ఈ ఘటన జరిగింది. నిందితుడు లొంగిపోయేందుకు పోలీస్ స్టేషన్ వైపు వెళుతుండగా.. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు మార్గమధ్యలోనే అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఫతేపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిత్వారా గ్రామంలో ఈ ఘటన జరిగింది. నిందితుడ్ని రియాజ్, బాధితురాలిని అసిఫాగా పోలీసులు గుర్తించారు. శుక్రవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన రియాజ్.. కాసేపటికి తిరిగొచ్చాడు. అనంతరం అసిఫాను బట్టలు ఉతకమని చెప్పాడు. దీంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లి బాధితురాలు బట్టలు ఉతికేందుకు సిద్ధమవుతుండగా.. ఒక్కసారిగా పదునైన ఆయుధంతో వెనుకనుంచి ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆమె తల తెగి కింద పడింది. అనంతరం తలను తీసుకుని నడిరోడ్డుపై నడుచుకుంటూ పోలీస్ స్టేషన్ వైపుగా వెళ్లాడు రియాజ్.
ఒక చేతిలో సోదరి తలను.. మరో చేతిలో ఆయుధంతో నడిరోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న రియాజ్ చూసి.. స్థానికులంతా భయాందోళనకు గురయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతడి నుంచి యువతి తలను, ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పథకం ప్రకారమే ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తుంది. ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్న కారణంగా.. బాధితురాలిని కావాలనే బయటకు రప్పించి.. హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఘటనకు ఇదే కారణం..
మే 25న అదే గ్రామానికి చెందిన యువకుడితో అసిఫా పారిపోయింది. అనంతరం ఐదుగురు వ్యక్తులపై అసిఫా తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు.. అసిఫా జాడను కనుగొని.. ఆమెతో పాటున్న యువకుడిపై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. ప్రస్తుతం అతడు జైలులోనే ఉన్నాడు. అయితే అసిఫా ప్రవర్తన పట్ల తీవ్ర ఆగ్రహానికి గురైన రియాజ్.. ఆమెను హత్య చేశాడు. రియాజ్‌పై ఇంతకు ముందే పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రియాజ్‌కు స్థానికంగా ఓ కూరగాయల కొట్టు ఉందని వారు వెల్లడించారు.