ఒకప్పుడు పెళ్లంటే.. అమ్మాయింటికి అబ్బాయి తరఫువాళ్లు.. అబ్బాయింటికి అమ్మాయి తరఫువాళ్లు వెళ్లి.. అంతా నచ్చితే సరే అని వివాహం జరిపించేవారు. కానీ ఇప్పుడంతా ఆన్లైన్లోనే. ఫొటో చూసి నచ్చితే ఓకే చెప్పేయడమే. అయితే ఇలా ఓకే చెప్పిన బిహార్ దక్షిణ చంపారన్ జిల్లాకు చెందిన ఓ అమ్మాయికి చేదు అనుభవం ఎదురైంది. మరికొన్ని క్షణాల్లో పెళ్లి అనగా.. నేరుగా అబ్బాయిని చూసిన వధువు.. ఒక్కసారిగా లేచి తనకు వరుడు నచ్చలేదంటూ.. మండపం నుంచి పరుగులు తీసింది. దీంతో అంతా గందగోళం.. అయోమయం.
అసలు ఏమైందంటే..?
బైరియా పోలీస్‌స్టేషన్ పరిధిలోని తదీవానందపుర్‌కు చెందిన ఓ యువతికి బగహి ముసాహితోలాకు చెందిన అనిల్ కుమార్ అనే యువకుడితో పెళ్లి చేయడానికి నిర్ణయించారు పెద్దలు. వాట్సాప్‌లో పంపిన అబ్బాయి ఫోటోను చూసి ఆ యువతి సరేనని పెళ్లికి ఒప్పుకుంది. దీంతో ఓ గుడిలో వివాహతంతు నిర్వహించాలని పెద్దలు భావించారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. బంధుమిత్ర కుటుంబ సమేతంగా వరుడు పెళ్లి మండపానికి చేరుకున్నాడు. సంప్రదాయబద్ధంగా చేయాల్సిన తంతు అంతా ముగిసింది. వధూవరులు పెళ్లికి సిద్ధంగా ఉన్నారు. తాళి కట్టడమే ఆలస్యం.. కానీ ఇక్కడే కథ అడ్డం తిరిగింది.
తాళి కట్టబోయే ముందు వరుడిని నేరుగా చూసింది వధువు. అంతే సంగతులు.. వరుడు అదో రకంగా ఉన్నాడని, అతన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని మండపం నుంచి దూరంగా పారిపోయింది ఆమె. అక్కడికి వచ్చిన పెళ్లి పెద్దలంతా ఆమెకు నచ్చజెప్పడానికి విఫలయత్నం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఘర్షణ వాతావరణం నెలకొంది. చివరకు భార్యతో కలిసి వెళ్లాల్సిన వరుడిని.. వట్టి చేతులతో వెనక్కి పంపారు వధువు తరపు బంధువులు.
ఇదీ చూడండి: ఆటో డ్రైవర్‌కు రూ.56 వేల కరెంటు బిల్లు