Brain Dead Girl Organ Donation Chandigarh : ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన నాలుగేళ్ల బాలిక ఇద్దరికి కొత్త జీవితం ప్రసాదించింది. ప్రాణాలతో పోరాడుతున్న ఇద్దరు రోగులకు అవయవ దానం చేయడం చేసి వారికి ఊపిరి పోసింది. చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (PGIMER)లో ఈ ఘటన జరిగింది.
ఆస్పత్రి వర్గాలు చెప్పిన వివరాల ప్రకారం హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన బాలిక జనవరి 2న కింద పడి స్పృహ కోల్పోయింది. వెంటనే బాలిక కుటుంబ సభ్యులు ఆమెను దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడం వల్ల ఆమెను PGIMERకు వైద్యులు సిఫార్సు చేశారు. జనవరి 3న బాలికను PGIMERలో చేర్చారు. వైద్యులు ఎంతగా ప్రయత్నించినా బాలికను కాపాడలేకపోయారు. జనవరి 9న ఆమెను బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు.
"బ్రెయిన్ డెడ్ అయిన స్థితి నుంచి బాలిక సాధారణ స్థితి రాలేదని స్పష్టత వచ్చిన తర్వాత PGIMERకు చెందిన ట్రాన్స్‌ప్లాంట్ కోఆర్డినేటర్లు ఆమె తండ్రిని సంప్రదించారు. బాధలో ఉన్నప్పటికీ తల్లిదండ్రులు సుహృదయంతో ఆలోచించి అవయవ దానానికి అంగీకరించారు" అని PGIMER ఆస్పత్రి తన ప్రకటనలో తెలిపింది. అయితే, బాలిక తండ్రి తన వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు.
'ఇతరుల శరీరాల్లో సజీవంగా ఉండొచ్చు'
'అవయవ దానం చేస్తే ఎవరికైనా ఉపయోగపడుతుందని మేం ఇందుకు ఒప్పుకున్నాం. మా బాధ కూడా కాస్త తగ్గుతుందని భావించాం. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనే తల్లిదండ్రులు కూడా అవయవ దానానికి ముందుకొచ్చేందుకు మా నిర్ణయం ప్రేరణ ఇస్తుందని భావిస్తున్నాం. ప్రజలందరికీ అవయవ దానంపై అవగాహన రావాలి. మరణంతో ఏదీ ముగిసిపోదు. ఇతరుల శరీరాల ద్వారా మనం ఇంకా జీవించవచ్చు' అని బాలిక తండ్రి చెప్పినట్లు ఆస్పత్రి యాజమాన్యం వెల్లడించింది.
దాత కుటుంబానికి తాము రుణపడి ఉంటామని PGIMER డైరెక్టర్ వివేక్ లాల్ పేర్కొన్నారు. ఇది అత్యంత కఠినమైన నిర్ణయమని అన్నారు. దాత కుటుంబం నిర్ణయం వల్ల అవయవ వైఫల్యంతో బాధపడుతున్న రోగుల్లో ఆశలు చిగురించాయని తెలిపారు. అవయవ దానం చేసేందుకు ముందుకొస్తున్న ఇలాంటి వారి వల్లే ఏటా వందలాది మందికి రెండో జీవితం లభిస్తోందని పేర్కొన్నారు. అదేసమయంలో ఆస్పత్రి వైద్య బృందం చేసిన కృషిని అభినందించారు. దాతను జాగ్రత్తగా చూసుకున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు.
భర్త బ్రెయిన్ డెడ్- అవయవదానం చేసి మంచి మనసు చాటుకున్న భార్య, నలుగురి ప్రాణాలు సేఫ్!