Boyfriend Attacks Girlfriend : నడిరోడ్డుపై ప్రియురాలి గొంతుకోసి పరారయ్యాడు ఓ యువకుడు. తన మాట వినడం లేదని ఆగ్రహించిన ప్రియుడు.. ఆమె తల్లి ఎదుటే ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గుజరాత్ సూరత్‌లో జరిగింది. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు.
ఇదీ జరిగింది
విష్ణు వాసవ అనే వ్యక్తి ఓ యువతి గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ ఏడాదిన్నరగా సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల విదేశాలకు వెళ్లాలని అనుకున్నాడు విష్ణు. ఈ విషయం ప్రియురాలికి చెప్పి.. ఆమెను ఇంటికి తిరిగి వెళ్లాలని సూచించాడు. దీనికి ప్రియురాలి నిరాకరించడం వల్ల ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగాయి. తాజాగా ఇదే విషయమై మరోసారి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
దీంతో ఆగ్రహించిన ప్రియురాలు.. విష్ణుపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తల్లితో సహా స్టేషన్‌కు బయలుదేరింది. ఈ విషయం తెలుసుకున్న విష్ణు.. రోడ్డుపై వెళ్తున్న ప్రియురాలిపై దాడి చేశాడు. ఆమె తల్లి ఎదుటే ప్రియురాలి గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని యువతిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉందని పోలీసులు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసుకుని.. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
పోలీసులకు ఫిర్యాదు చేశాడని కొడవలితో దాడి
బాలికలను వేధిస్తున్నాడని ఫిర్యాదు చేశాడన్న కోపంతో ఓ వ్యక్తిపై కొడవలితో దాడి చేశాడో యువకుడు. ఈ ఘటన కర్ణాటక బెంగళూరులో బుధవారం రాత్రి జరిగింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి.
అనేకల్ ప్రాంతానికి చెందిన రామచంద్ర ఇంట్లో ట్యూషన్ నడుస్తోంది. ఇక్కడికి అనేక మంది విద్యార్థులు వస్తుంటారు. ఈ క్రమంలోనే అక్కడికి వస్తున్న బాలికలను సిద్దార్థ అనే వ్యక్తి స్నేహితులతో వచ్చి వేధించాడు. దీనిని గమనించిన రామచంద్ర.. ఆరు నెలల క్రితం అనేకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో రామచంద్రపై కోపం పెంచుకున్న నిందితుడు సిద్దార్థ.. అతడిపై దాడి చేశాడు. భార్యాపిల్లలతో బయట ఉన్న రామచంద్రపై కొడవలితో దాడి చేశాడు. అనంతరం పక్కన ఉన్న బైకు, దుకాణంపై దాడిచేసి అక్కడినుంచి పరారయ్యాడు. హత్యాయత్నం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు.