Boy Dies in Dogs Attack in Hanamkonda : వీధి కుక్కల దాడిలో మరో బాలుడు మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లాలో వీధి శునకాల దాడిలో 7 సంవత్సరాల చోటు అనే బాలుడు మృతి చెందాడు. కాజీపేటలోని రైల్వే కాలనీలో బిహార్‌కు చెందిన ఓ బాలుడు ఆడుకుంటున్న క్రమంలో రెండు కుక్కలు పిల్లాడిపై దాడి చేశాయి. దీంతో చోటుకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు.. హుటాహుటిన 108 వాహనంలో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ చోటు మృతి చెందాడు.
బాలుడి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. చోటును తలచుకొని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. బతుకు దెరువు కోసం చోటు కుటుంబం నిన్ననే కాజీపేటకు వచ్చారు. బాలుడు మృతి చెందిన విషయం తెలుసుకున్న ప్రభుత్వ చీఫ్ విప్ ధాస్యం వినయ్ భాస్కర్ ఎంజీఎం ఆసుపత్రికి చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆయనతో పాటు వరంగల్ మహా నగర పాలక సంస్థ మేయర్ గుండు సుధారాణి, ఛైర్మన్ సుందర్ రాజు బాధితులను ఓదార్చారు.
Bihar boy dies in dogs attack in Telangana : మృతదేహాన్ని బిహార్‌కు పంపించేందుకు ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ధాస్యం వినయ్ భాస్కర్ స్పష్టం చేయగా.. వీధి కుక్కలను నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని మేయర్ గుండు సుధారాణి వివరించారు. బాధిత కుటుంబానికి వరంగల్ మహా నగరపాలక సంస్థ తరఫున రూ.లక్ష పరిహారాన్ని అందిస్తామని తెలిపారు.
ఈ ఘటనతోనైనా అధికారులు మేల్కోవాలి..: ఈ ఘటనకు సంబంధించి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైల్వే క్వార్టర్స్‌లో వీధి కుక్కలు ఉన్నాయని.. వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని గతంలో అధికారులను కోరినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఇదే ప్రదేశంలో ఓ బాలికపై వీధి శునకాలు దాడి చేశాయని.. పది రోజుల కిందటా ఓ రైల్వే ఉద్యోగిపై కుక్కలు దాడి చేశాయని స్థానికులు వాపోతున్నారు. ఇన్ని ఘటనలు జరుగుతున్నా మున్సిపల్ అధికారులు చోద్యం చూస్తున్నారని మండిపడుతున్నారు. ఈ ఘటనతోనైనా అధికారులు మేల్కొని.. కుక్కల నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి: