Boy Complaint on His Stepmother: సహజంగా పార్టీలు, ఫంక్షన్లు అంటే చాలా మంది కొత్తబట్టలు వేసుకుంటారు. ఇక చిన్నపిల్లలు అయితే కచ్చితంగా కావాలని అడుగుతారు. వద్దని చెపితే మారం చేస్తుంటారు. అప్పటికి ఇవ్వకపోతే మంకుపట్టు పట్టి సాధించుకుంటారు. అయితే ఈ బుడ్డోడు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించాడు. స్నేహితుడు పుట్టినరోజు ఫంక్షన్ వెళ్లడానికి కొత్త చొక్కా ఇవ్వలేదని ఓ పని చేశాడు. ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓ పక్క ఫ్రెండ్ పుట్టిన రోజుకు టైం అవుతోంది. అక్కడికి వెళ్లాలి. కానీ ఇక్కడ అమ్మేమో తెల్ల చొక్కా అగిడితే ఇవ్వనంటోంది. ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ ఓ పదేళ్ల బుడతడు ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు. అనుకున్నదే తడవుగా స్నానం చేసి కట్టుకున్న టవల్తోనే చొక్కా లేకుండా నేరుగా పోలీసుస్టేషన్‌కు వెళ్లాడు. తన తల్లిపై పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. బాలుడి కంప్లైంట్ విని పోలీసులు సైతం అవాక్కయ్యారు. అయితే ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉందండోయో.. ఆ తల్లి కన్నతల్లి కాదు.. మారు తల్లి. ఈ ఆసక్తికర సన్నివేశం ఏలూరు జిల్లాలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని కొత్తపేటలో తల్లిదండ్రులతో కలిసి నివాసముంటున్న సాయిదినేష్‌కు పదేళ్లు. నాలుగో తరగతి పూర్తి చేసి ఐదులోకి వెళుతున్నాడు. ఇతని తల్లి రెండేళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందగా తండ్రి మరో పెళ్లి చేసుకున్నారు. సాయి దినేష్‌కు ఓ సోదరి ఉంది. ఆదివారం స్నేహితుడి పుట్టినరోజు కావడం వల్ల అక్కడికి వెళ్లాలని సాయి దినేష్ స్నానం చేసి మారు తల్లిని తెల్ల చొక్కా ఇవ్వమన్నాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. బయటకు వెళ్లొద్దని గట్టిగా చెప్పింది. అయినప్పటికీ బుడ్డోడు మారాం చేస్తుంటే కొట్టింది.
దీంతో దినేష్ చొక్కా వేసుకోకుండానే టూటౌన్ పోలీసుస్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ తన మారుతల్లిపై ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న సీఐ చంద్రశేఖరరావు.. సాయి దినేష్ తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. పిల్లల పట్ల ప్రేమతో ఉండాలని సూచించారు. అదే విధంగా తల్లిదండ్రుల మాట వినాలని, చక్కగా చదువుకోవాలని, గౌరవంగా మెలగాలని బాలుడికీ సూచించారు. అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే మరోవైపు అల్లరి చేశాడని గత సంవత్సరం సాయిదినేష్‌కు మారు తల్లి వాతలు పెట్టింది. ఈ విషయంపై అప్పట్లో స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో ఆమెపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇవీ చదవండి: