టైరు పేలడం 'యాక్ట్ ఆఫ్ గాడ్' కాదని.. అది పూర్తిగా మానవ నిర్లక్ష్యమేనని తీర్పునిచ్చింది బొంబాయి హైకోర్టు. కారు ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి పరిహారంపై కోర్టును ఆశ్రయించిన ఇన్సూరెన్స్ కంపెనీ పిటిషన్‌ను విచారిస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. మృతుడి కుటుంబానికి రూ.1.25 కోట్ల పరిహారం ఇవ్వాలని మోటార్ యాక్సిడెంట్ క్లైమ్స్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. బొంబాయి హైకోర్టును ఆశ్రయించింది న్యూ ఇండియా అసూరెన్స్ కంపెనీ. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఎస్జీ డిగే ఏకసభ్య ధర్మాసనం.. ఇన్సూరెన్స్ కంపెనీ అప్పీలును తిరస్కరించింది.
మకరంద్ పట్వర్ధన్ అనే వ్యక్తి 2010లో తన స్నేహితులతో కలిసి పుణె నుంచి ముంబయికి వెళ్తున్నాడు. కారు యజమాని అయిన తన స్నేహితుడు.. మితిమీరిన వేగంతో నడిపాడు. ఫలితంగా వెనుక టైర్ పేలిపోయి లోతైన గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో పట్వర్ధన్ అక్కడిక్కడే మరణించాడు. దీంతో అతడి కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. దీనిపై ఇన్సూరెన్స్ కంపెనీని ఆశ్రయించగా.. వారు యాక్ట్ ఆఫ్ గాడ్‌గా పరిగణిస్తూ పరిహారాన్ని తిరస్కరించారు. దీంతో బాధిత కుటుంబం ఇన్సూరెన్స్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించింది. దీనిపై విచారించిన ట్రైబ్యునల్.. మృతుడి ఆదాయంపైనే కుటంబమంతా ఆధారపడి ఉందని గుర్తించింది. రూ. 1.25 కోట్ల పరిహారం ఇవ్వాలని బీమా సంస్థను 2016లో ఆదేశించింది.
అయితే, ఇన్సూరెన్స్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బొంబాయి హైకోర్టును ఆశ్రయించింది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ. ట్రైబ్యునల్ ఆదేశించిన మొత్తం అధికంగా ఉందని.. టైర్ పేలడం అనేది యాక్ట్ ఆఫ్ గాడ్ అని.. డ్రైవర్ తప్పిదం కాదని వాదించింది. ఇన్సూరెన్స్ కంపెనీ పిటిషన్‌పై విచారించిన బొంబాయి హైకోర్టు.. సంస్థ అభిప్రాయంతో విభేదించింది. డిక్షనరీ ప్రకారం యాక్ట్ ఆఫ్ గాడ్ అంటే మానవులు అదుపు చేయలేని సహజ శక్తి అని పేర్కొంది. దీని అర్థం యాక్ట్ ఆఫ్ గాడ్ అనేది మానవులు అదుపు చేయలేని చర్య అని.. కానీ టైర్ పేలడం అనేది యాక్ట్ ఆఫ్ గాడ్ కాదని.. ఇది పూర్తిగా మానవ నిర్లక్ష్యమేనని హైకోర్టు తేల్చిచెప్పింది.
హై స్పీడ్, సెకండ్ హ్యాండ్ టైర్లు, తక్కువ గాలి, ఎక్కువ గాలి ఉన్న టైర్లను వాడం కూడా కారణాలేనని వివరించింది. డ్రైవర్ లేదా యజమాని వాహనంలో ప్రయాణించే ముందు టైరు ఎలా ఉందో చెక్ చేసుకోవాలని.. టైరు పేలడం అనేది యాక్ట్ ఆఫ్ గాడ్ కాదని.. పూర్తిగా మానవ తప్పిదమేనని పునరుద్ఘాటించింది. కేవలం టైరు పేలడం అనేది యాక్ట్ ఆఫ్ గాడ్‌గా చూపించి పరిహారం చెల్లించకుండా ఉండడం సరైంది కాదని ఇన్సూరెన్స్ కంపెనీకి హైకోర్టు స్పష్టం చేసింది.
ఇవీ చదవండి : స్వలింగ సంపర్కుల వివాహాలకు గుర్తింపు ఇవ్వలేం: కేంద్రం
ప్రియుడి కోసం దుబాయ్ నుంచి వచ్చిన ఎయిర్‌హోస్టెస్.. నాలుగో అంతస్తు నుంచి దూకి..