Dussehra rally at Shivaji Park : ముంబయిలోని ప్రముఖ శివాజీ పార్క్ మైదానంలో దసరా ర్యాలీ నిర్వహణ విషయంలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే వర్గానికి ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ ర్యాలీ నిర్వహించేందుకు ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు బాంబే హైకోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చింది. పార్టీ ఎవరికి చెందాలనే వివాదం పరిష్కారమయ్యే వరకు పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవద్దని శిందే వర్గం చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. ర్యాలీ నిర్వహించేందుకు శివసేనలోని రెండు వర్గాలు చేసిన దరఖాస్తులను బృహన్ ముంబయి నగరపాలక సంస్థ తిరస్కరించిన నేపథ్యంలో.. విషయం బాంబే హైకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే.
శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయనే కారణం చూపించి బీఎంసీ ఇరు వర్గాలకూ అనుమతులను నిరాకరించింది. అయితే బీఎంసీ ఆర్డర్ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు స్పష్టం తెలుస్తోందని కోర్టు అభిప్రాయపడింది. ర్యాలీ నిర్వహణపై ఉద్ధవ్ శివసేన వర్గానికి అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఠాక్రే నేతృత్వంలోని శివసేన హర్షం వ్యక్తం చేసింది. న్యాయవ్యవస్థపై తమకున్న విశ్వాసం నిరూపితమైందని పేర్కొంది. ఈ ఏడాది ర్యాలీ అట్టహాసంగా నిర్వహిస్తామని పార్టీ అధికార ప్రతినిధి మనీషా కయాండే తెలిపారు. 1966 నుంచి ఏటా దసరా రోజున శివసేన ఇక్కడ ర్యాలీ నిర్వహిస్తోంది. కొవిడ్ కారణంగా 2020, 21లో ఈ కార్యక్రమం జరగకపోవడం, శివసేన రెండు వర్గాలుగా చీలిపోయిన నేపథ్యంలో.. ప్రస్తుతం ఈ ర్యాలీ నిర్వహణ కీలకంగా మారింది.
ఇదీ చదవండి: వృథా నీటి వ్యాపారం.. కొనుగోలు, అమ్మకాల విధానంపై నీతి ఆయోగ్ కసరత్తు
'భారతీయులూ.. జాగ్రత్త!'.. ఆ దేశంలోని వారికి కేంద్రం వార్నింగ్!