బంగాల్లో భాజపా అభ్యర్థి కారుపై బాంబుదాడి జరిగినట్టు పోలీసులు తెలిపారు. నాటు బాంబులుగా గుర్తించినట్టు చెప్పారు. అయితే.. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేశారు.
ఉత్తర 24 పరగణాల జిల్లా, ఖార్దా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న శిల్భద్ర దత్త.. తాను రోడ్డుపై నిల్చుని టీ తాగుతున్న సమయంలో ఈ దాడి జరిగిందని ఆరోపించారు.
"నేను కల్యాణి ఎక్స్ప్రెస్ వేపై కారు పార్క్ చేసి టీ తాగే సమయంలో ఎవరో బాంబు విసిరారు. అది.. ఆపి ఉన్న నా వాహనానికి అతి సమీపంలోనే పేలింది. దీని వెనుక తృణమూల్ కాంగ్రెస్ కుట్ర ఉంది. దీనిపై మేము ఎలక్షన్ కమిటీ(ఈసీ)కి ఫిర్యాదు చేస్తాం."
- శిల్భద్ర దత్త, భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి
బాంబు దాడి వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: కేంద్ర మంత్రి సహా కాంగ్రెస్ కీలక నేతలకు కరోనా