Uttarakhand CM on Elections: ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భాజపా గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తోంది. చరిత్రను తిరగరాసి రెండోసారి అధికారంలోకి రావాలని ఊవిళ్లూరుతోంది. ఈ క్రమంలో మంత్రిగా ఉన్న హరక్ సింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. అదే సమయంలో కొందరు సీనియర్లు కూడా భాజపాను వీడారు. ఈ నేపథ్యంలో పార్టీలోని అంతర్గత పరిణామాలు.. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా ముందుకెళ్తున్నారనే అంశాలపై సీఎం పుష్కర్ సింగ్ ధామి.. ఈటీవీ భారత్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. తమ సొంత విధానాలతోనే ఎన్నికల్లో పోరాడతామని, పార్టీలో ఎలాంటి గందరగోళ పరిస్థితులు లేవని ఈ సందర్భంగా స్పష్టం చేశారు సీఎం ధామి.
మెడికల్ కాలేజీ నిర్మాణానికి నిధులు ఇవ్వకపోవడం వల్లే హరక్ సింగ్ పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగరవేసిట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సీఎం స్పందించారు.
"మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం మా ప్రభుత్వం గణనీయమైన మొత్తాన్ని కేటాయించింది. పార్టీలో ఉన్నన్ని రోజులు ఆయనకు గుర్తింపు, గౌరవాన్ని సంపూర్ణంగా అందించాం."
-సీఎం పుష్కర్ సింగ్ ధామి
హరక్ సింగ్ రావత్‌ను కేబినెట్ నుంచి తొలగించడానికి, పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి అసలు కారణాలను కూడా వివరించారు పుష్కర్ సింగ్ ధామి. 'సిద్ధాంతాల ఆధారంగా మా పార్టీ పనిచేస్తుంది. ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినా.. వ్యతిరేక కార్యకలాపాలు చేసినా.. వారిపై చర్యలు ఉంటాయి.' అన్ని స్పష్టం చేశారు.
ఉత్తరాఖండ్‌లో సర్వేలు ఏం చెబుతున్నాయి? ప్రజలు ఏం అనుకుంటున్నారనే అనే విషయాలపై సీఎం తన మనోగతాన్ని వెల్లడించారు.
''రాష్ట్రంలో ప్రధానంగా కాంగ్రెస్- భాజపా మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందని చాలా సర్వేలు అంచనా వేస్తున్నాయి. ఒకటి, రెండు మినహా చాలా సర్వేలు మాకు పూర్తిస్థాయి మెజారిటీ వస్తుందని అంచనా వేశాయి. ఉత్తరాఖండ్ ప్రజలు ఇక్కడ సుస్థిర ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని.. కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించే ప్రభుత్వాన్ని వారు ఎన్నుకోవాలని అనుకుంటున్నారు.
ఉత్తరాఖండ్ అవసరాలను తీర్చడం అనేది కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యాంశాల్లో ఒకటిగా ఉంది. ఐదేళ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి పనులు చేశాం. 2014, 2017, 2019లో మేం మెజారిటీ సీట్లు సాధించాం. ఈ సారి కూడా గెలుస్తాం.''
- సీఎం పుష్కర్ సింగ్ ధామి
'కేంద్రం ప్రభుత్వం సహకారంతో రాష్ట్రంలో గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధినే ప్రధాన అస్త్రంగా ప్రజల్లోకి వెళ్తాం' అని తెలిపారు పుష్కర్ సింగ్. 'స్థానిక సమస్యలపై ప్రజలు కొందరు కోపంతో ఉన్న మాట వాస్తవమే. అలాగే స్మార్ట్ సిటీ అభివృద్ధి విషయంలో జాప్యం జరుగుతుంది. ప్రకృతి వైపరీత్యాలు, పర్యావరణ సమతుల్యతపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. అయితే అభివృద్ధి కావాలంటే అవి తప్పవనే విషయాన్ని గ్రహించాలి.
ఉత్తరాఖండ్‌లో వరదల సమస్య ఎప్పుడూ ఉంటుంది. ఈ సమస్య పరిష్కారానికి మేము పరిశోధనలు జరిపాం. వరదలు, విపత్తుల గురించి అంచనా వేయడానికి ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ కూడా ఉంది. దానిపై ఆలోచిస్తాం.' అని సీఎం పుష్కర్ సింగ్ ధామి అన్నారు.
ఇదీ చదవడి: Uttarakhand Election 2022: ఓటరు మౌనం.. పార్టీల్లో ఉత్కంఠ!