వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై భారతీయ జనతా పార్టీ దృష్టి సారించింది. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తిరిగి విజయ కేతనం ఎగురవేయాలని, లేని చోట్ల ఉనికిని చాటుకునేందుకు తీవ్ర కసరత్తులు చేస్తోంది. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి, రాష్ట్రాల నాయకత్వానికి దిశానిర్దేశం చేయడానికి నేరుగా అధిష్ఠానం రంగంలోకి దిగింది.
ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా ఆయా రాష్ట్రాల పార్టీ వ్యవహారాలను ప్రత్యేక్షంగా పర్యవేక్షిస్తున్నారు. అవసరమైన సంస్థాగత నిర్ణయాలను సైతం వెనువెంటనే తీసుకుంటున్నారు. ఉత్తరాఖండ్‌లో ముఖ్యమంత్రి మార్పే ఇందుకు నిదర్శనం.
వచ్చే ఏడాది గోవా, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపుర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే భాజపా అధిష్ఠానం మాత్రం.. సార్వత్రిక ఎన్నికల్లో కీలకం కానున్న యూపీ, గుజరాత్, ఉత్తరాఖండ్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.
చర్చలు ఇలా..
గతవారం దిల్లీకి వెళ్లిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. అమిత్ షా, మోదీలను వేర్వేరుగా కలిశారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని వివరించారు. అలాగే కేంద్ర మంత్రివర్గ విస్తరణపై కూడా చర్చించారు.
ఉత్తరాఖండ్‌లో ఇప్పటికే ఏకంగా ముఖ్యమంత్రిని మార్చిన అధిష్ఠానం.. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేసింది.
భాజపా పంజాబ్ రాష్ట్ర అధ్యక్షుడితో అమిత్ షా ఇప్పటికే సమావేశమయ్యారు. రైతుల ఆందోళనలతో పాటు రాష్ట్రంలోని కుంభకోణాలపై చర్చలు జరిపారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
గుజరాత్‌పై ప్రత్యేక దృష్టి
సొంతగడ్డ గుజరాత్‌పై మోదీ, షా ద్వయంతో పాటు కేంద్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కరోనాను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. సీఎం విజయ్ రూపానీని బాధ్యుడిని చేస్తూ.. విపక్షాలు విరుచుకుపడ్డాయి. ఈ నేపథ్యంలో గుజరాత్‌పై ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తోంది నాయకత్వం.
రెండు రోజుల క్రితమే గుజరాత్లో పర్యటించి.. దిల్లీకి వచ్చారు ఆ రాష్ట్ర పార్టీ ఇంచార్జ్ భూపేంద్ర యాదవ్. రాష్ట్రంలో పరిస్థితిపై పార్టీ పెద్దలకు నివేదిక అందించారు. ఈ క్రమంలో మంగళవారం మళ్లీ ఆయన్ను గుజరాత్‌కు పంపింది పార్టీ అధిష్ఠానం. దీన్ని బట్టి అర్థం అవుతుంది భాజపా కేంద్ర నాయకత్వం గుజరాత్‌కు ఎంత ప్రాముఖ్యత ఇస్తోందనేది.
2022 డిసెంబర్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అప్పటిలోపు రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్ది పార్టీకి ఎలాంటి మచ్చ రాకుండా ముందు జాగ్రత్త పడుతోంది హైకమాండ్. ఇందుకోసం ప్రభుత్వంలో సమూలమైన మార్పులు చేయాలని భావిస్తోంది.
భూపేంద్ర యాదవ్.. గత గుజరాత్ పర్యటనలో రాష్ట్ర కోర్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి.. అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించాలని సూచించారు.
ఇదిలా ఉంటే ఎంపీ సీఆర్ పాటిల్ పార్టీ గుజరాత్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విభేదాలు అంతగా లేవని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
"ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలు జరిగేటప్పుడు ముందస్తు సన్నాహాలు అవసరం. ఇతర పార్టీల్లాగా ఎన్నికలొచ్చినప్పుడు కాకుండా.. ఎన్నికలకు ముందుగానే భాజపా సంసిద్ధం అవుతుంది. అభివృద్ధి మంత్రం మాత్రమే గుజరాత్ ఎన్నికల్లో పని చేస్తుంది. గుజరాత్ ఫలితాలు కచ్చితంగా దేశం మొత్తాన్ని ప్రభావితం చేస్తాయి. కానీ ఇతర రాష్ట్రాల ఫలితాలు గుజరాత్‌ను పెద్దగా ప్రభావితం చేయలేవు.
మహమ్మారిని ఎవరూ ఊహించలేదు. కరోనాను అరికట్టడంలో ఇబ్బందులు ఎదురైనప్పటికీ గుజరాత్ ప్రభుత్వం పరిస్థితులను చక్కగా చక్కపెట్టింది."
-ఎంపీ సీఆర్ పాటిల్, భాజపా గుజరాత్ రాష్ట్ర అధ్యక్షుడు
ఉత్తరాఖండ్ తరహాలో మార్పులు?
యూపీలో సైతం యోగి ఆదిత్యనాథ్‌పై అనేక విమర్శలు వచ్చాయి. అయితే ఉత్తరాఖండ్ తరహాలో యూపీలో సీఎం మార్పు ఉండదని అధిష్ఠానం స్పష్టం చేసింది. వచ్చే ఎన్నికల్లో యోగి ఆధ్వర్యంలోనే పార్టీ పోటీ చేస్తుందని తేల్చేసింది.
అయితే గుజరాత్లో మాత్రం ఉత్తరాఖండ్ తరహా మార్పు అనివార్యమైనట్లు కనిపిస్తోంది. సీఎం విజయ్ రూపానీపై వచ్చిన ఆరోపణలను హైకమాండ్ నిశితంగా పరిశీలిస్తోంది. అసంతృప్తికి సంబంధించి విజయ్ రూపానీకి వివరించే ప్రయత్నాలను పార్టీ చేస్తోంది.
కర్ణాటకలో సైతం..
కర్ణాటక భాజపాలో సైతం అంతర్గత కలహాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పార్టీ పెద్దలు.. జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్‌ను బెంగళూరుకు పంపారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం యడియురప్పతో చర్చించి అరుణ్ సింగ్ నివేదిక తయారు చేయనున్నారు. దాన్ని దిల్లీ పెద్దలకు అందజేయనున్నారు.