పార్టీకి చెందిన మంత్రులు, నాయకులు డబ్బులు చెల్లించి సొంత నియోజకవర్గాల్లో కరోనా టీకా వేయించుకోవాలని భారతీయ జనతా పార్టీ సూచించింది. కొవిడ్ టీకాను ప్రైవేటు ఆసుపత్రుల్లో 250 రూపాయలు తీసుకుని వేసేలా ఆరోగ్యమంత్రిత్వశాఖ అనుమతించిన నేపథ్యంలో ఈ మేరకు తెలిపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వచ్చే వారంలో వ్యాక్సిన్ తీసుకోవాలని నాయకులకు సూచించినట్లు పేర్కొన్నాయి.
రాంపూర్‌లో టీకా తీసుకునేందుకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నట్లు తెలిపిన కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ.. ఇందుకుగాను డబ్బులు చెల్లిస్తానని చెప్పారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరో 2 రోజుల్లో టీకా తీసుకుంటారని ఆయన సన్నిహితులు తెలిపారు. సోమవారం నుంచి దేశవ్యాప్తంగా రెండోవిడత కరోనా వ్యాక్సినేషన్ మొదలుకాగా.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు టీకా వేయించుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దిల్లీలోని మెదాంత ఆస్పత్రిలో టీకా వేయించుకున్నట్లు హోంశాఖ వర్గాలు తెలిపాయి.