ETV Bharat / bharat

దక్షిణాదిపై భాజపా గురి.. '2024' కోసం పక్కా ప్లాన్​తో..

BJP South India plan: ఉత్తరాదిలో ఘన విజయాలు సాధిస్తున్న భాజపా.. దక్షిణ భారతదేశంపై గురిపెడుతోంది. 2019లో పశ్చిమబెంగాల్‌, ఒడిశాలలో సాధించిన ఫలితాలను ఇక్కడ ఈసారి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకను మినహాయిస్తే దక్షిణాదిలో మిగిలిన 101 లోక్‌సభ స్థానాల్లో నాలుగే గెలుచుకున్న కమలం పార్టీ.. ఈ పరిస్థితిని మార్చాలని ప్రణాళికలు రచిస్తోంది.

BJP SOUTH india plan
BJP SOUTH
author img

By

Published : Jul 11, 2022, 7:53 AM IST

BJP South India mission: ఉత్తరాది రాష్ట్రాల్లో ఇప్పటికే వేళ్లూనుకున్న భాజపా.. ఇప్పుడు దక్షిణాదిపై గురిపెడుతోంది. దక్షిణ భారతంలో ఒకప్పుడు బలంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఉనికి కోల్పోతుండటం, ప్రాంతీయ పార్టీలకూ అంతగా పట్టు కనిపించకపోవడంతో ఈ రాష్ట్రాల్లో 2024 లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలని తలపెడుతోంది. 2019లో పశ్చిమబెంగాల్‌, ఒడిశాలలో సాధించిన ఫలితాలను ఇక్కడ ఈసారి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తోంది. హైదరాబాద్‌లో ఇటీవల భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈ విషయం చర్చకు వచ్చింది. గత సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకను మినహాయిస్తే దక్షిణాదిలో మిగిలిన 101 లోక్‌సభ స్థానాల్లో తమకు నాలుగే వచ్చిన విషయాన్ని అగ్రనేతలు ప్రస్తావించారు. కొద్దిరోజుల తర్వాత రాజ్యసభకు రాష్ట్రపతి సభ్యులను నామినేట్‌ చేయాల్సి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళ, కర్ణాటకల నుంచి నలుగురు దిగ్గజాలను ఎంపిక చేశారు.

2014, 2019 ఎన్నికల్లో ఉత్తరాదిలో ఘన విజయాలు సాధించడంతో కేంద్రంలో అధికారాన్ని దక్కించుకున్న భాజపా.. తర్వాత పశ్చిమబెంగాల్‌, ఒడిశాలాంటి తూర్పు రాష్ట్రాలతోపాటు ఈశాన్యంలోనూ వేళ్లూనుకుంది. కర్ణాటకలో ముందునుంచీ ఆ పార్టీ బలంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కేరళ, తమిళనాడుల్లో మాత్రం పెద్దగా ఫలితాలు రావట్లేదు. ఏపీ, తమిళనాడుల్లో ఒకప్పుడు బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు తెదేపా, అన్నాడీఎంకే ప్రస్తుతం వైకాపా, డీఎంకేల నుంచి గట్టి సవాలును ఎదుర్కొనే ప్రయత్నంలో ఉన్నాయి. మరోవైపు వామపక్షాల పాలనలోని కేరళలో 45% వరకూ ఉన్న మైనారిటీ ఓటుబ్యాంకు అక్కడ భాజపా ప్రవేశానికి అడ్డుగోడలా ఉంది.

గతంలో పొత్తులతోనే..
కర్ణాటకలో 2008లోనే తొలిసారి అధికారంలోకి వచ్చినా, ఆ రాష్ట్ర సరిహద్దులు దాటి దక్షిణ రాష్ట్రాల్లోకి కమలనాథుల ప్రవేశం జరగలేదు. ఎప్పటికప్పుడు ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం తప్ప, సొంతంగా బలమైన నాయకత్వాన్ని ఈ రాష్ట్రాల్లో భాజపా తయారుచేసుకోలేకపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1999లో తెదేపా పొత్తుతో 9 ఎంపీ స్థానాలు, తమిళనాట డీఎంకేతో పొత్తుపెట్టుకుని 4 ఎంపీ స్థానాలు గెలుచుకుంది.

ఆ కారణాల వల్లే!
దేశంలో చాలా రాష్ట్రాల కంటే దక్షిణాది రాష్ట్రాలు సామాజిక-ఆర్థిక సూచీల్లో ముందుంటాయి. దాంతో హిందుత్వ, సంక్షేమవాదాలపై ఆధారపడే భాజపా ఇక్కడ అంతగా రాణించలేకపోతోంది. కానీ, స్థానిక ప్రభుత్వాల వైఫల్యాల గురించి ప్రశ్నించేందుకు తెలంగాణలో బండి సంజయ్‌, తమిళనాట అన్నామలైలాంటి నేతలను రంగంలోకి దించింది. ఆంధ్రప్రదేశ్‌లో తెదేపాతో పొత్తును తెంచుకోగా.. తెలంగాణలో పాలకపక్షంపై పోరాడుతోంది. నాలుగు రాష్ట్రాల్లోనూ ప్రతిపక్షంలో కావల్సినంత ఖాళీ ఉందని, దాన్ని తాము భర్తీచేస్తామని భాజపాకు చెందిన ఓ సీనియర్‌ నేత అన్నారు.

నాయకత్వలేమి
దక్షిణాది రాష్ట్రాల్లో భాజపా మెరుగైన ఫలితాలు సాధించలేకపోవడానికి ఆయాచోట్ల బలమైన నాయకత్వం లేకపోవడమే ప్రధాన సమస్యగా కనిపిస్తోంది. నాలుగు రాష్ట్రాలకు ఒక్క తెలంగాణలోనే నాయకత్వం కాస్త బలంగా ఉంది. ఇటీవల తెలంగాణలో ప్రజాసంగ్రామ యాత్ర చేపట్టిన బండి సంజయ్‌, తమిళనాట అన్నామలై అధికార పార్టీలపై కాస్త ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ప్రజల్లో కనిపిస్తున్నారు.

తెలంగాణలో దూకుడుగా..
హైదరాబాద్‌లో జాతీయ కార్యవర్గ సమావేశం, అనంతరం మోదీతో భారీ బహిరంగ సభ నిర్వహించడం ద్వారా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంపై భాజపా గురిపెట్టింది. కానీ, రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఏకఛత్రాధిపత్యంగా సాగుతున్న తెరాస పాలనకు ఎదురొడ్డటం అంత సులభం కాదు. దక్షిణాదిలో ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలో భాజపా బలంగా ఉందని ఆ రాష్ట్ర భాజపా అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌ రావు వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో మెజార్టీ స్థానాలు సాధించడం కష్టమే అయినప్పటికీ.. ప్రజలు తెరాసకు తమనే ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారని అన్నారు.

ద్రవిడ పార్టీలకు దీటుగా..
తమిళనాడులో ద్రవిడ పార్టీల ఆధిపత్యాన్ని తోసిరాజని స్థానిక సంస్థల ఎన్నికల్లో పాక్షిక విజయం సాధించిన ఊపుతో.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 25 స్థానాలు సాధిస్తామని అన్నామలై ధీమా వ్యక్తంచేస్తున్నారు. అన్నాడీఎంకే అంతర్గత కుమ్ములాటల్లో ఉండటంతో డీఎంకేను దీటుగా ఎదుర్కొంటున్నది భాజపానే అని అక్కడి పరిశీలకులు చెబుతున్నారు. ఇళయరాజాను రాజ్యసభకు పంపడం ఓటర్ల అభిమానాన్ని సంపాదిస్తుందని భాజపా ఆశిస్తోంది. కేరళలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కచోటా భాజపా గెలవలేదు. పీటీ ఉషను రాజ్యసభకు పంపడంతో కొంత ఉనికి చాటుకోవచ్చని భావిస్తోంది.

కోరమాండల్‌ రాష్ట్రాలుగా పేరొందిన దక్షిణ, తూర్పు రాష్ట్రాల్లో ఈసారి మంచి ఫలితాలు సాధించాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రణాళికలు రచిస్తున్నారు. పశ్చిమబెంగాల్‌లో 42కుగాను 17, ఒడిశాలో 21కి 8 స్థానాలు సాధించడంతో పాటు.. తెలంగాణలో 17కు 4 వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ సంఖ్యను మరింత పెంచుకోవాలని తమ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ ప్రణాళికలు ఎంతవరకు ఫలిస్తాయో తెలియాలంటే 2024 లోక్‌సభ ఎన్నికల వరకూ ఆగాల్సిందే.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.